తొలి ప్రభల తీర్థం... చిరతపూడిలో..
సాక్షి, అమలాపురం/ అంబాజీపేట: సంక్రాంతి అంటే ప్రభల తీర్థం.. ప్రభల తీర్థం అనగానే కోనసీమ స్ఫురణకు వస్తుంది. అటువంటి కోనసీమలో ప్రభల తీర్థం మొదలైంది ఎప్పుడనేదానిపై స్పష్టత లేదు. నాలుగున్నర శతాబ్దాల చరిత్ర ఉందని మాత్రం వేద పండితులు, తీర్థాల నిర్వాహకులు చెబుతూ వస్తున్నారు. అయితే కోనసీమ జిల్లాలో తొలి ప్రభల తీర్థం తమ గ్రామంలో ప్రారంభమైందని చెబుతున్నారు చిరతపూడి ప్రభల తయారీ నిర్వాహకులు.
పూర్వం చిరతపూడిని చిరుతపూడి అగ్రహారంగా పిలిచేవారు. చిరతపూడి పొలిమేర (అవిడి డ్యామ్ సెంటరు ప్రభల తీర్థం) ప్రాంతంలో ప్రభల తీర్థం మొదలై 476 సంవత్సరాలు అయిందని, నాటి నుంచి నేటి వరకు తీర్థాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ ప్రభల తీర్థం మొదలు కావడానికి ఉమ్మడి గుంటూరు జిల్లా కోటప్పకొండ వద్ద నిర్వహిస్తున్న ప్రభల తీర్థం స్ఫూర్తినిచ్చింది. ఈ గ్రామానికి చెందిన కర్ర చందన శాస్త్రి పూర్వం కోటప్పకొండకు పరమేశ్వరుని దర్శించుకునేందుకు వెళ్లారు. అక్కడ చూసి వచ్చి స్థానికంగా కనుమ పండగ రోజు ప్రభల తీర్థాన్ని ప్రారంభించారు. పంచముఖాలైన శివుని ఆలయాలు చిరతపూడి అగ్రహారం చుట్టుపక్కల ఉండడంతో అందరికీ అనుకూలంగా చిరతపూడి ఊరి పొలమేరలో ప్రభల తీర్థం నిర్వహించాలని సంకల్పించారు. అందుకు సంబంధించి ఆయా గ్రామాల పెద్దలను సంప్రదించి ప్రభల ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతం రెండు నియోజకవర్గాలకు, నాలుగు గ్రామాలకు సరిహద్దుగా ఉంది. ఇక్కడ తీర్థానికి కూడా విశిష్టత ఉంది.
శివుని పంచముఖాలు
చిరతపూడి నుంచి సద్యోజాత రుద్రుడు (బ్రహ్మేశ్వర స్వామి), నరేంద్రపురం నుంచి వామదేవ రుద్రుడు, కుందాలపల్లి నుంచి అఘోరా రుద్రుడు, ఈశాన్య రుద్రుడు ప్రబల తీర్థానికి తరలివస్తారు. ఈ పంచముఖాల శివుని ఆలయాలు వెలసి సమీపంలో ఉండడంతో గ్రామాల పెద్దలు చిరతపూడి సరిహద్దులో ప్రభల తీర్థం నిర్వహించడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ తీర్థంలో తల్లి ప్రభలతోపాటు మరో 55 ప్రభలు కొలువు తీరుతాయి. ఇక్కడ తీర్థంలో తొలుత చిరతపూడికి చెందిన బ్రహ్మేశ్వరుడి ప్రభ కొలువు తీరుతారు, తీర్థం ముగిసిన తరువాత మాత్రమే తిరిగి వెళుతుంది.
ఆనాటి నుంచి
విజయవంతంగా..
ప్రభల తీర్థాన్ని అప్పట్లో కొనసీమ చిరతపూడి అగ్రహారంలో నిర్వహించారు. కర్ర చందన శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభల ఉత్సవాన్ని ప్రారంభించారు. శివుని పంచముఖాలు అయిన ఐదు ఆలయాలు ఇక్కడే ఉండడం వల్ల అందరికీ దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో చిరుతపూడి గ్రామ శివారులో ఉత్సవాన్ని చేయాలని అప్పటి పెద్దలు నిర్ణయించి ఘనంగా జరిపించారు. ఆనాటి నుంచి నేటి వరకు చిరతపూడిలో ప్రభల ఉత్సవం విజయవంతంగా కొనసాగుతోంది.
– కొత్తలంక కొండలరావు శర్మ,
వేద పండితుడు, చిరతపూడి
476 సంవత్సరాల నుంచి నిర్వహణ
గుంటూరు జిల్లా
కోటప్ప కొండ ప్రభల తీర్థం స్ఫూర్తి
తరువాత మిగిలిన
ప్రాంతాలకు విస్తరణ
తొలి ప్రభల తీర్థం... చిరతపూడిలో..


