పల్లెల్లో పండగ ఛాయలు
ఐ.పోలవరం/ అమలాపురం రూరల్: తెలుగువారు జరుపుకొనే అతిపెద్ద పండగ సంక్రాంతి గడియలొచ్చాయి. దీంతో పచ్చని కోనసీమ సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఎక్కడెక్కడ ఉన్నవారు రావడంతో రావడంతో జిల్లాకు కొంత వరకై నా సంక్రాంతి వెలుగు వచ్చింది. వీధుల్లో కళ్లాపులు.. రంగువల్లులతో పల్లెలు, పట్టణాలకు పండగ కళ వచ్చింది. భోగి మంటలకు పాత సామానులు, కొబ్బరి దుంగలను వీధుల్లో యువకులు సిద్ధం చేస్తున్నారు. హరిదాసులు, డూడూ బసవన్నల రాకతో పండగ ఛాయలు కనిపిస్తున్నాయి.
బస్టాండ్‌లు కిటకిట
నాలుగు రోజుల పండగకు జిల్లా వాసులు సన్నాహాలు చేసుకుంటున్నారు. వలస వెళ్లిపోయినవారితో బోసిపోయిన పల్లెలు వారి రాకతో కళకళలాడుతున్నాయి. రణగొణ ధ్వనులు, ఆప్యాయతానురాగాలకు దూరమైన జీవనం, యాంత్రిక బతుకులకు సెలవు ఇచ్చి వలసదారులు రెక్కలు కట్టుకుని వాలిపోయారు. భోగి మంటలకు కొబ్బరి, తాటి దుంగలు, పిడకలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆతిథ్యానికి గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. సున్నుండలు, పోకుండలు, జంతికలు, ఇలంబీకాయలు, కొబ్బరినూజు, వెన్నప్పాలు, గోరుమిటీలు, పొంగడాలను ఇప్పటికే తయారు చేశారు. నిన్న మొన్నటి వరకు మార్కెట్‌లలో పండగ సందడి లేకున్నా... భోగికి ఒక రోజు ముందు మంగళవారం వస్త్ర, బంగార మార్కెట్ కొంతమేర కళకళలాడాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు, వెళ్లేవారితో ఆర్టీసీ బస్టాండ్‌లు కిటకిటలాడుతున్నాయి.
నేడు భోగి
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని నిర్వహిస్తారు. ఈ పండగ తొలి రోజు వచ్చేదే ‘భోగి’. దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణ అర్ధగోళానికి, భూమికి దూరంగా జరుగుతాడు. దీనివల్ల భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది. ఈ చలిని తట్టుకునేందుకు గతంలో చలి మంటలు వేసుకునేవారు. ఇదే సమయంలో తాము పడిన కష్టాలు, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ రైతులు వేసే మంటలను భోగి మంటలు అంటారు. భోగి మంటలు వెనుక పురాణం కథనాలు, శాసీ్త్రయ కారణాలు కూడా ఉన్నాయి. భోగి మంటలతో సంక్రాంతి పండగకు నాంది పలుకుతారు. ఇంటి ముందు ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి సంబరాలు మొదలు పెడతారు. పిల్లలకు తలపాగా లాగా చుట్టి భోగి పండ్లను (రేగి పళ్లు, జామ పళ్లు, పూలు, నాణేలు కలిపి) పోస్తారు. దీనివల్ల వారు ఆరోగ్యంగా, సంపన్నంగా ఉండాలని కోరుకుంటారు. భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. ఈ రోజు ధనుర్మాసానికి ముగింపు. పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని.. దీని సంకేతంగానే భోగి పండగ ఆచరణలోకి వచ్చిందని చెబుతారు. కృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదేనంటారు. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కి, ఆయనను అక్కడ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమిచ్చాడనేది మరో కథనం. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో ఉంది.
కోనసీమ జిల్లాకు వచ్చిన
ఇతర ప్రాంత వాసులు
పండగ ముందు రోజు
మార్కెట్‌లో హడావుడి
వస్త్ర వ్యాపారాల వద్ద కొంత సందడి
పల్లెల్లో పండగ ఛాయలు
పల్లెల్లో పండగ ఛాయలు


