సత్యదేవుని సన్నిధిలో నేడు సంక్రాంతి వేడుకలు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. దీనికోసం రత్నగిరిపై రామాలయం ముందున్న ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇక్కడ పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ తుని తపోవనం స్వామీజీ సచ్చిదానంద సరస్వతి బుధవారం ఉదయం ఆరు గంటలకు భోగి మంట వెలిగించనున్నారు. అనంతరం, భక్తులనుద్దేశించి సంక్రాంతి విశిష్టతపై స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తారు. భోగి మంట, జానపద కళారూపాల ప్రదర్శనలకు రత్నగిరిపై ఏర్పాట్లు చేశారు. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా తాటాకులతో వేసిన గుడిసె, కొబ్బరి, ఈత, తాటి చెట్లు, తామర, కలువ పూలతో కూడిన కొలను, ధాన్యపు రాశి, నుయ్యి, రచ్చబండ, కోడిపుంజులు, ఎడ్లబండి, పొట్టేలు, ఆవు దూడ వంటి కళారూపాలు ఏర్పాటు చేస్తున్నారు. గంగిరెద్దుల వాళ్లు, బుడబుక్కల సాయిబు, జంగమ దేవర, కొమ్మదాసరి సందడి చేయనున్నారు. సత్యదేవుని వార్షిక కల్యాణ వేదికపై సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను భక్తులు దర్శించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం, రాజగోపురాలను విద్యుద్దీపాలు, పుష్పమాలికలతో అలంకరిస్తున్నారు. భోగి పండ్లు వేసేందుకు ఉదయం 9 గంటలకు చిన్నారులను సంక్రాంతి వేడుకల వద్దకు తీసుకుని రావాలని అధికారులు కోరారు.


