షికారుకు పోదాం.. చలో చలో
● అభయారణ్యంలో ఫుల్ జోష్
● పర్యాటకుల కోసం ముస్తాబు
● ప్రత్యేక ఆకర్షణగా
మినీ థియేటర్, అక్వేరియం
ఆనందం.. ఆపై భద్రత
పర్యాటకులకు మరింత ఆనందాన్ని అందించడంతో పాటు వారి భద్రతే లక్ష్యంగా అదనపు సౌకర్యాలు కల్పించాం. ప్రకృతి అందాలతో పాటు ఇక్కడ విశేషాలను తెలిపై విధంగా మినీ థియేటర్, ప్రకృతి ప్రేమికుల కోసం అక్వేరియం, ప్రకృతి స్టాల్స్ ఏర్పాటు చేశాం. ఉడెన్ బ్రిడ్జిలపై గుంపులు, గుంపులుగా తిరగడం చేయరాదు. పండగ రద్దీ దృష్ట్యా ఐదు ప్యాసింజర్ బోట్లతో పాటు, మరో మూడు స్పీడు బోట్లు అందుబాటులో ఉంచాం. లైఫ్ జాకెట్ వేసుకున్న వారిని మాత్రమే బోటు షికారుకు అనుమతిస్తాం.
–ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజర్, కోరంగి అభయారణ్యం
అభయారణ్యంలో బోటు షికార్
తాళ్లరేవు: పచ్చదనం రా రమ్మని పిలుస్తోంది.. ప్రకృతి ఒడిలో ఒదిగిపోమని ఆహ్వానిస్తోంది.. పర్యాటకులు సరదా గడిపేందుకు బోటు షికారు చక్కని అనుభూతిని మిగుల్చుతోంది.. సంక్రాంతి సెలవులను పురస్కరించుకుని ప్రముఖ పర్యాటక కేంద్రం కోరంగి అభయారణ్యం ముస్తాబైంది. ప్రకృతి ఒడిలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఆటపాటలతో గడిపేందుకు వేదిక అవుతోంది. సందర్శకులను మరింత ఆకర్షించడంతో పాటు, వినోదాన్ని పంచే విధంగా అటవీ శాఖ మరిన్ని సదుపాయాలను కల్పించింది. అభయారణ్యం విశేషాలను తెలియజేసే మినీ థియేటర్, మత్స్య, పక్షి జాతులను వీక్షించే విధంగా అక్వేరియం, ప్రకృతి స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. ఏటా జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఏడాది నుంచి రోజుకు నాలుగు వేల మందికిపైగా సందర్శించే అవకాశం ఉండడంతో పాటు ఒక ట్రిప్పునకు 150 మంది బోటు షికారు చేసే విధంగా చర్యలు చేపట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చే సందర్శకుల కోసం తాగునీరు, తినుబండారాలు, శీతల పానీయాల దుకాణాలను ఏర్పాటు చేయడంతో పాటు స్వయంగా వంటలు చేసుకునే అవకాశం కల్పించారు. ఉడెన్ బ్రిడ్జిలకు మరమ్మతులు చేసి సర్వాంగ సుందరంగా తయారు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అభయారణ్యాన్ని సందర్శించవచ్చు.
ఆకర్షణీయం.. అక్వేరియం
అభయారణ్యం ప్రాంతంలో సంచరించే మత్స్య జాతులను పర్యాటకులు వీక్షించే విధంగా నూతనంగా భారీ అక్వేరియం ఏర్పాటు చేశారు. ఇది అభయారణ్యానికే ప్రత్యేక ఆకర్షణ కానుంది. దీంతో పాటు మడ అడవుల ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా డాక్యుమెంటరీని రూపొందించి మినీ థియేటర్‌లో పది నిమిషాలు ప్రదర్శించే విధంగా రూపొందించారు. అదేవిధంగా వివిధ రకాల పక్షులను పర్యాటకులు చూసే విధంగా ప్రత్యేక భారీ పంజరాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే వివిధ రకాల మొక్కలను కూడా ప్రదర్శించనున్నారు. ఆసక్తి ఉన్నవారికి మొక్కలను విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు.
హుషారు.. బోటు షికారు
ఇక్కడ పర్యాటకులకు బోటు షికార్ ప్రత్యేక అనుభూతినిస్తుంది. ఏపీ టూరిజం, అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బోట్లపై గోదావరి పాయలో ప్రయాణించి సముద్రం కలిసే ప్రాంతానికి తీసుకు వెళతారు. అక్కడి నుంచి మడ అడవుల అందాలతో పాటు, కాకినాడ సిటీ అందాలు పర్యాటకులను అలరిస్తాయి. మడ చెట్లపై సంచరించే వివిధ రకాల పక్షులు, జంతువులు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. అదేవిధంగా కేరళ తరహాలో మడ అడవుల్లో ఉండే చిన్నపాటి క్రీక్ (పిల్ల కాలువలు)ల్లో పర్యాటకులు బోట్లపై సందర్శించే విధంగా క్రీక్ విజిట్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. బోట్‌పై విహరిస్తూ అభయారణ్యం అందాలను ఆస్వాదించడం మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది.
పక్షులు, మొక్కలను వీక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రకృతి స్టాల్
కోరంగి అభయారణ్యం స్వాగత ద్వారం వద్ద పర్యాటకుల సందడి (ఫైల్)
షికారుకు పోదాం.. చలో చలో
షికారుకు పోదాం.. చలో చలో
షికారుకు పోదాం.. చలో చలో
షికారుకు పోదాం.. చలో చలో


