లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
మరో ఇద్దరికి గాయాలు
గొల్లప్రోలు (పిఠాపురం): గొల్లప్రోలు మండలం చేబ్రోలు సమీపంలో 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. కత్తిపూడి వైపు నుంచి పిఠాపురం వైపు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న తునికి చెందిన యువకులు పంతాడి దుర్గా ప్రసాద్ (21), ఆసనాల ప్రసాద్, ఆసనాల మహేష్‌లు చేబ్రోలు సమీపంలోకి వచ్చే సరికి భారత్ పెట్రోల్ బంకు ఎదురుగా 216 రోడ్డులో వెనుక నుంచి బిక్కవోలు మండలం ఆర్‌ఎస్ పేటకు చెందిన లారీ తవుడు లోడ్‌తో అనపర్తి వెళ్తూ ఢీకొంది. దీంతో మోటార్ సైకిల్‌తో సహా ముగ్గురు యువకులు రోడ్డుపై పడిపోయారు. వెనుక కూర్చున్న దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆసనాల ప్రసాద్, మహేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొని..
కె.గంగవరం: కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కపిలేశ్వరపురం మండల చినకోరుమిల్లి గ్రామానికి చెందిన అంబడి సుబ్బారావు (45) వ్యవసాయ కూలి. ఇటీవల కుటుంబ సభ్యులంతా పనుల నిమిత్తం హైదరాబాద్ వలస వెళ్లారు. ఆదివారం చిన కోరుమిల్లిలో యూత్ క్రిస్మస్‌లో పాల్గొనేందుకు తిరిగి గ్రామానికి వచ్చారు. దుస్తులు కొందామని రామచంద్రపురానికి భార్య మరియమ్మతో కలసి మోటారు సైకిల్‌పై వెళ్తుండగా పామర్రు వచ్చేసరికి, సాయితేజ అనే యువకుడు కారుపై ఎదురుగా వస్తూ ఢీకొన్నాడు. తీవ్ర గాయాలైన సుబ్బారావును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడు. మరియమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. కారు పంటబోదెలోకి దూసుకుపోయింది. దీనిపై ఎస్సై సోమేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చోరీ కేసుల్లో వ్యక్తికి జైలు
కాకినాడ లీగల్: తొమ్మిది చోరీ కేసుల్లో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ డి.శ్రీదేవి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కాకినాడ ఏటిమొగ ప్రాంతానికి చెందిన రేకాడి వెంకటేశ్వర్లు గత ఏడాది కాకినాడ, జగన్నాథపురంలో గోళీలపేట, శ్రీరామనగరపురం వీధి, చిన్న మార్కెట్ సెంటర్, గోగి దానయ్యపేట, పప్పులమిల్లు శ్రీరామనగర్ వెనుక వైపు డాల్‌మిల్లు, దుర్గాటెంపుల్ స్ట్రీట్, ఆకాశపువారి వీధిలోని వివిధ ప్రాంతాల్లో చోరీలు చేశాడు. బాధితులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశారు. కోర్టు విచారణలో వెంకటేశ్వర్లు నేరం రుజువు కావడంలో పైవిధంగా శిక్ష పడింది.
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం


