కువైట్‌లో కె.ఏనుగుపల్లి మహిళ మృతి
పి.గన్నవరం: కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లికి చెందిన ఒక మహిళ మృతి చెందింది. గత శుక్రవారం ఈ ప్రమాదం జరగ్గా సోమవారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. స్థానికుల వివరాల ప్రకారం.. శేరు విజయలక్ష్మి (55) జీవనోపాధి నిమిత్తం గత 20 ఏళ్లుగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో రెండున్నరేళ్ల క్రితం ఆమె కువైట్ దేశానికి వెళ్లింది. అప్పటి నుంచి ఒక ఇంట్లో హెల్పర్‌గా పనిచేస్తోంది. ఈక్రమంలో గత శుక్రవారం యజమాని కుటుంబ సభ్యులతో పాటు ఆమె కారులో కువైట్ సిటీ నుంచి జహ్రా వైపు వెళ్తుండగా 7వ రింగ్ రోడ్‌లో ప్రమాదం జరిగింది. ఇందులో ఇంటి యజమాని కుటుంబానికి చెందిన ఒక చిన్నారితో పాటు విజయలక్ష్మి మృతి చెందింది. ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. విజయలక్ష్మి మృతదేహాన్ని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కె.ఏనుగుపల్లికి తీసుకువచ్చారు. మృతదేహాన్ని చూసి బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. విజయలక్ష్మికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు
మద్యం మత్తులో వ్యక్తిపై దాడి
అనపర్తి: మద్యం మత్తులో గుర్తు తెలియని వ్యక్తి ఒకరిపై దాడి చేయగా పరిస్థితి విషమంగా ఉంది. బిక్కవోలు పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం బిక్కవోలు జువ్వలదొడ్డి ప్రాంతానికి చెందిన నర్సిరెడ్డి బాలాజీ స్థానిక వంతెన సెంటర్ నుంచి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి మద్యం మత్తులో అకారణంగా దూషిస్తూ కిలో రాయి తీసుకుని అతని తలపై కొట్టాడు. బాలాజీ కింద పడిపోవడంతో మళ్లీ ముక్కుపై దాడి చేసి పరారయ్యాడు. క్షతగాత్రుడిని స్థానికులు అనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.


