కాలు దువ్వుతున్న కోడిసీమ!
హాస్యాస్పదంగా మారిన పోలీసు హెచ్చరికలు
ఒకవైపు పందేలు అడ్డుకుంటామని జిల్లాలో స్టేషన్ ఎస్‌ఐల నుంచి ఎస్పీ వరకు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నా జూదాల నిర్వాహకులు మాత్రం వెనకడుగు వేయడం లేదు. అధికార పార్టీ కీలక నేతల వత్తాసుతో బరులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎంపిక చేసుకున్న ఒకటి, రెండు బరుల వద్దకు వెళ్లి హెచ్చరికల ఫ్లెక్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మురమళ్ల, అల్లవరం వంటి రూ.లక్షలలో పందేల జరిగే బరుల వద్ద ఇటువంటి ఫ్లెక్స్‌లు ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
పందేల నిర్వహణకు విరివిగా
బరుల ఏర్పాటు
కోర్టు ఆంక్షలు, పోలీస్ హెచ్చరికలు బేఖాతర్
ఐ పోలవరం, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు
మండలాల్లో మరీ జోరుగా..
గుండాటల నిర్వహణకూ
ప్రత్యేక సౌకర్యాలు
సామాజిక మాధ్యమాలలో రా..
రమ్మని ఆహ్వానాలు
ప్రతి చోటా అనధికార వేలం పాటలు
సాక్షి, అమలాపురం: కోడి పందేలు, గుండాటలు అడ్డుకోవాలని కోర్టులు ఆంక్షల విధిస్తోంది. జూదాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం అరెస్టులు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా జూదరాయుళ్లు వెరవడం లేదు. వెనకడుగు వేయడం లేదు. పందేల కోసం కాలు దువ్వుతున్నారు. క్రీడా మైదానాల స్థాయిలో భారీ బరుల నిర్మాణలు చేస్తున్నారు. గతంలో కనీసం సంక్రాంతి వరకు పందేల నిర్వహణను రహస్యంగా ఉంచేవారు. ఇప్పుడు అధికార పార్టీ నేతల వత్తాసుతో పందేల నిర్వహణ బహిరంగం అయింది. ఈ ఏడాది ఒక అడుగు ముందుకు వేసి సామాజిక మాధ్యమాలలో పందేలకు రా.. రమ్మని ఆహ్వానాలు పంపించడం గమనార్హం. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అనగానే కోడిపందేలు గుర్తుకు వస్తాయి. ఈ ఏడాది వీటిని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క ప్రాంతం అనేది లేకుండా జిల్లాలో ప్రతి మండలంలో పందేలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో కోడి పందేలు, గుండాటల నిర్వహణలో ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. టీడీపీ, జననసే చోటామోటా నాయకులు సైతం పందేల నిర్వహణకు సై అంటున్నారు. కోడిపందేల వద్ద జరిగే గుండాటలకు వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. వీటితోపాటు పందేల బరుల వద్ద కిళ్లీ షాపులు, అనధికార మద్యం షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వేలం పాటలు నిర్వహిస్తున్నారు.
ప్రతిచోటా పందెం బరులు
అమలాపురం నియోజకవర్గంలో అల్లవరం మండలంలో పందేలు జరగనున్నాయి. ఇక్కడ కోడూరుపాడు, అల్లవరం, గుత్తులవారిపాలెం, రెల్లుగడ్డ, గుండెపూడి గ్రామాలు, ఉప్పలగుప్తం మండలంలో భీమనపల్లి పంచాయతీ శివారు భట్టుపాలెం, గొల్లవిల్లి, పెదగాడవిల్లి, ఎన్.కొత్తపల్లి, చల్లపల్లి, ఎస్.యానంలో కోడి పందేల నిర్వహణకు బరులు రెడీ అవుతున్నాయి. ఎస్.యానం సంక్రాంతి సంబరాల్లో కోడి పందేల నిర్వహణకు పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. చినగాడవిల్లి శివారు ప్రాంతంలో జగనన్న కాలనీలో స్థానికులు అభ్యంతరం చెబుతున్నా అధికార పార్టీకి చెందినవారు కోడి పందేల నిర్వహణకు బరులు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. అమలాపురం రూరల్ పరిఽధిలోని కామనగరువు, పేరూరు, సమనస, వన్నెచింతలపూడి గ్రామాల్లో పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్తపేట నియోజకవర్గం పరిధిలో రావులపాలెం, రావులపాడుల వద్ద భారీగా పందేలు నిర్వ హించేలా ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఇక్కడ జాతీయ రహదారులను ఆనుకుని పందేల బరులు సిద్ధం చేస్తున్నారు. ఆలమూరు మండలం మడికి, జొన్నాడల వద్ద కూడా జాతీ య రహదారుల సమీపంలోనే పందేలు నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తపేట, పలివెల, ఆత్రేయపురం, లొల్ల లాకుల సమీపంలో పందేలు జరగనున్నాయి.
రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో రామచంద్రపురం పట్టణంలోనే మూడుచోట్ల పందేల నిర్వహణకు చురుగ్గా పనులు చేస్తున్నారు. రామచంద్రపురం మండలంలో నాలుగు బరులు, కె.గంగవరం, కాజులూరు మండలాల్లో ఐదు చొట్ల చొప్పున బరులు సిద్ధం చేస్తున్నారు.
పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ముక్కామల, అయినవిల్లి మండలం సరిపల్లి, విలస, పి.గన్నవరం మండలంలో పోతవరం, ఉడిమూడి, డి.ఎస్.పాలెంలో కోడిపందేలు జరగనున్నాయి.
రాజోలు దీవిలో మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో బరులు అధికంగా ఉన్నాయి. ఈ రెండు మండల కేంద్రాలతోపాటు లక్కవరం, శివకోడు, కాట్రేనిపాడు, ములికిపల్లి, గోగన్నమఠం, పొన్నమండ, కడలి, దిండిల్లో పందేల వేసేందుకు నిర్వహకులు సిద్ధమవుతున్నారు.
రూ.లక్షల్లో బేరసారాలు
కొబ్బరి తోటల్లో ట్రాక్టర్ల సాయంతో చదును చేసి పందెం రాయుళ్లు రాకపోకలు నిర్వహించడానికి అనువుగా తాత్కాలిక రహదారుల ఏర్పాటు, మోటారు సైకిల్ పార్కింగ్, కూర్చోని చూడటానికి ప్రత్యేకంగా కుర్చీలను తరలించారు. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల నడుమ కోడి పందేలు నిర్వహించడానికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందేలతో పాటుగా గుండాట నిర్వహించుకునేలా రూ.లక్షల్లో బేరసారాలు జరుగుతున్నాయి. వీటితో పాటుగా జూదం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కాలు దువ్వుతున్న కోడిసీమ!
కాలు దువ్వుతున్న కోడిసీమ!


