నాటి సందళ్లు ఏమాయె! | - | Sakshi
Sakshi News home page

నాటి సందళ్లు ఏమాయె!

Jan 12 2026 7:37 AM | Updated on Jan 12 2026 7:37 AM

నాటి

నాటి సందళ్లు ఏమాయె!

వచ్చాం.. వెళ్లాం అన్నట్టుగా

సాగుతున్న పెద్ద పండగ

నాటి కళ కానరాని పల్లెలు

ఒకప్పుడు వారం పది రోజుల

ముందే దిగిపోయే పిల్లాజెల్లా

నేడు ఆ మూడు రోజులకే పరిమితం

అంతా ఇన్‌స్టెంట్‌ సంతోషాలే

రీల్స్‌లో.. యూట్యూబ్‌లలో మాత్రం ఆటలు, పాటలు, మ్యూజిక్కులు

రోజులు మారిపోయాయంటున్న పెద్దలు

సాక్షి, అమలాపురం/అంబాజీపేట: పేడ కళ్లాపులు.. ఇలవేల్పు ముగ్గులతో ముస్తాబయ్యే పూరి పాకలు.. పెంకుటిళ్ల ముంగిట మంచి ముత్యాలు పోసినట్లుగా రంగవల్లులు. రెండు వరుసల ఇళ్ల మధ్య చూడ చక్కని ముగ్గులు.. డూడూ బసవన్నలు.. వీధి చివర భోగి మంటలు.. ఊరి చివర కోడి పందేలు.. హరిలో రంగ హరి కీర్తనలు... కిటకిటలాడే వస్త్ర దుకాణాలు.. అన్నదాత ఇంట ధాన్యపు రాశులు.. పాల పొంగులు.. కొత్త అందాలతో ముస్తాబయ్యే ఆవులు.. ఎద్దులు.. ఎడ్ల బండ్లు.. ఇదీ తెలుగు పల్లెల్లో సంక్రాంతి కళ. పండగ వస్తుందంటే చాలు వారం పది రోజుల నుంచి ప్రతి ఇంటా.. ప్రతి పల్లెలో ఒక రకమైన జోష్‌. వస్త్ర దుకాణాల వద్ద కొనుగోలుదారులతో పట్టణాల్లో ఒకటే సందడి. కాని ఇప్పుడు ముగ్గులు వేయని పల్లెలు.. కొనుగోలుదారులు లేని పట్టణాలలోని మార్కెట్లు చూస్తుంటే సంక్రాంతి సందడి జిల్లాలో మూడు రోజులకే పరిమితమవుతున్నట్టు కనిపిస్తోంది.

ఈ సందడి అంతా ఒకప్పటి వైభవమేనా అంటే ప్రస్తుతం జిల్లాలోని పల్లెలు, పట్టణాలు చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తోంది. దూర ప్రాంతాల నుంచి బంధువులు, వలస వెళ్లిన స్థానికులు రావడం మొదలైనా ఇంకా పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకోలేదు. పెద్దవారిని కదిలిస్తే తమ చిన్ననాటి పండగ వాతావరణం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదని వాపోతున్నారు. ‘ఉద్యోగాలు, ఉపాధి అంటూ చాలా మంది గ్రామాలకు దూరమయ్యారు. ఎక్కడెక్కడో ఉంటున్నారు. వారు వచ్చే వరకు పల్లెకు పండగ సందడి రావడం లేదు’ అని ఊరిలో ఉన్న పెద్దలు వాపోతున్నారు.

పల్లెల్లోని పూరిళ్ల అలుకులు ఇంకా మొదలు కాలేదు. వీధులలో ముగ్గుల సందడి లేదు. అడపాదడపా గంగిరెద్దువాళ్లు, హరిదాసులు, కొమ్మదాసరులు వస్తున్నారు. ఈ వృత్తిని సంప్రదాయంగా, కుటుంబ వారసత్వంగా భావిస్తున్న కొందరు మాత్రమే ఆ పరంపరను కొనసాగిస్తున్నారు. ‘మా చిన్న నాట వారం రోజుల ముందు నుంచే పిల్లలు, యువకులు భోగి మంటలు వేసేందుకు దుంగలు, పాత చెక్క సామాన్లు పోగు పెట్టేవారు. ఇప్పుడు భోగి ముందు రోజుకే వీటి సేకరణ పరిమితమైంది. భోగి మంటలు చిన్నబోతున్నాయి’ అని అంబాజీపేటకు చెందిన బొంతు సోమేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. ధనుర్మాసం నుంచి ఇళ్ల వద్ద పేడ కళ్లాపులు వేసి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టడం గోదావరి జిల్లాలో ఆనవాయితీ. ఇప్పుడు కళ్లాపులు లేవు. ముగ్గుల సైజులు కూడా తగ్గిపోయాయి.

పట్టణాలు వెలవెల

పల్లెలు మాత్రమే కాదు.. వస్త్రాలు, హోమ్‌నీడ్స్‌, బంగారం, వాహనాల కొనుగోళ్లు లేక పట్టణాలు సైతం వెలవెలబోతున్నాయి. అమలాపురం పట్టణంలోని ప్రధాన వస్త్ర వ్యాపార ప్రదేశం శ్రీదేవి మార్కెట్‌ వీధిలో కూడా సాయంత్రం కొంత వరకు సందడి ఉన్నా గతంలోని పండగ రోజులతో పోలిస్తే అంతంత మాత్రమేనని వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో పెద్ద పెద్ద మాల్స్‌ వద్ద కొంత సందడి నెలకొంది. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారి వల్ల సోమ, మంగళవారం కొనుగోళ్లు పెద్ద ఎత్తున సాగుతాయని వ్యాపారులు ఆశలు పెట్టుకున్నారు. ‘ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల లబ్ధి లేదు. వరి, ఆక్వా రైతులు దెబ్బ తిన్నారు. రియల్‌ ఎస్టేట్‌ మరీ దారుణంగా ఉంది. దీని వల్ల ఈ ఏడాది కొనుగోళ్లు సగం కూడా లేవ’ని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

పండగ అంతా రీల్స్‌లో

గోదావరి జిల్లాలో పండగంతా ఇప్పుడు సామాజిక మాధ్యమాలలోని రీల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ఏది తెరిచి చూసినా పండగ సందడి కనిపిస్తోంది. గంగిరెద్దులు, రంగురంగుల ముగ్గులు, గోదావరి రుచులు, కోడి పందేలు ఇలా సంక్రాంతి అంతా రీల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. అసలైన పండగంతా రీల్స్‌లోనే కనిపిస్తోంది. వీటికి బ్యాక్‌ గ్రౌండ్‌ సంగీతం కూడా హోరెత్తిస్తోంది. వీటితోపాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో నిర్వహిస్తున్న పండగ సంబరాల వల్ల ఈ ఏడాది జిల్లాలో కొంత వరకు సంక్రాంతి సందడి కనిపించింది.

ముగ్గులు లేక బోసిపోతున్న వీధులు

అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలోని ప్రధాన వీధి. ఈ గ్రామ సమీపంలోనే జగ్గన్నతోట ప్రభల తీర్థం జరుగుతోంది. ఈ ఊరి నుంచి వెళ్లే ప్రభ కౌశికను దాటి వెళ్లడం చూసేందుకు వేల మంది తరలివస్తారు. పదేళ్ల క్రితం సంక్రాంతి అంటే ఊరంతా ఒక ఉత్సాహం. ఎక్కడా లేని పండగ వాతావరణం. వీధిలో బంధువులతోను, ప్రభ కట్టేవారితోను, ఇంటి ముంగిట రంగవల్లులు వేసే మహిళలతోనూ, లోగిళ్లలో పెద్దలు చిన్నారులు కూర్చుని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ సందడిగా ఉండేది. పండగ ఘడియలు వచ్చినా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆ ఉత్సాహం కనిపించడం లేదు.

నాటి సందళ్లు ఏమాయె!1
1/3

నాటి సందళ్లు ఏమాయె!

నాటి సందళ్లు ఏమాయె!2
2/3

నాటి సందళ్లు ఏమాయె!

నాటి సందళ్లు ఏమాయె!3
3/3

నాటి సందళ్లు ఏమాయె!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement