పండగవేళా ఎదురుచూపులే..
● జిల్లా ఆటోవాలా యూనియన్
అధ్యక్షుడు సత్తిరాజు ఆవేదన
అమలాపురం టౌన్: సంక్రాంతి సీజన్‌లోనూ ప్రయాణికుల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని జిల్లా ఆటోవాలా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఆటో డ్రైవర్ల జవనోపాధిపై గట్టి దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురంలో ఈ మేరకు సత్తిరాజు ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆటో డ్రైవర్ల పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పిల్లలకు బట్టల కొనుగోళ్లకు, రెండు నెలల ఆటో వాయిదాలకు సరిపడే డబ్బులను కష్టించి సంపాందించేవాళ్లమని, జనాలు రోడ్లపై కిటకిటలాడుతున్నా ఆటో డ్రైవర్లకు తగిన బేరాలు, ప్రయాణికులు లేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కొద్దిమంది ఆటో డ్రైవర్లకు మాత్రమే రూ.15 వేల సాయాన్ని అందించి, మిగిలిన వారికి ఇవ్వలేదని అన్నారు.
జిల్లా బార్ ఫెడరేషన్
కన్వీనర్‌గా అజయ్‌కుమార్
అమలాపురం టౌన్: జిల్లా బార్ ఫెడరేషన్ ఆదివారం ఏర్పాటైంది. అమలాపురం బార్ అసోసియేషన్ భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని ఆరు బార్ అసోసియేషన్ల ప్రతినిధులు ఫెడరేషన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫెడరేషన్ కన్వీనర్‌గా అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి అజయ్‌కుమార్ ఎన్నికయ్యారు. కో కన్వీనర్‌గా ముమ్మిడివరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డి నాగేశ్వరరావు, సభ్యులుగా రాజోలు బార్ అసోసియేషన్ నుంచి ప్రభుత్వ న్యాయవాది గుబ్బల రజిత, ముమ్మిడివరం బార్ నుంచి రామాయణం మహేశ్వరరావు, అమలాపురం బార్ ప్రధాన కార్యదర్శి దొమ్మేటి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు యాలంగి సత్యనారాయణ, రామచంద్రపురం బార్ అధ్యక్షుడు ఉండవల్లి గోపాలరావు, కొత్తపేట బార్ అధ్యక్షుడు నేతల మోహనరావు, రాజోలు బార్ అధ్యక్షుడు అయ్యప్ప, ఆలమూరు బార్ అధ్యక్షుడు కాండ్రేగుల భీమశంకరం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం డిమాండ్ చేసింది. అమలాపురంలో జిల్లా కోర్టు కోసం సేకరిస్తున్న భూముల వద్ద న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఆరోగ్య బీమా కార్డులు మంజూరు చేయాలని సూచించారు.
నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్
అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయితో పాటు, మూడు రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాల్లో మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ జరుగుతుందన్నారు.
పండగవేళా ఎదురుచూపులే..


