మూల్యం చెల్లించాల్సిందే!
● కోనసీమలో కానరాని పండగ సందడి
● సలసల కాగుతున్న నూనె ధరలు
● అదే దారిలో నిత్యావసర వస్తువులు
● గత ఏడాది కన్నా 30 శాతం పెరుగుదల
● బెంబేలెత్తుతున్న సగటు జీవులు
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: పంట ఉత్పత్తుల కోత.. ప్రకృతికి, పశువులకు కృతజ్ఞతలు చెప్పడం.. సంప్రదాయాలను పాటించడం.. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం.. బంధాలను బలోపేతం చేసుకోవడం.. పిండి వంటలు వండుకోవడం.. నూతన వస్త్రాలు, వాహనాలలు, బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం.. సుదూర ప్రాంతాల నుంచి తరలిరావడం.. పండగ నాలుగు రోజులు సొంతవారితో సందడి చేయడం.. ఇలా సంక్రాంతి పండుగల్లో అన్నీ ఆనందకరమైన విషయాలే. కాని పంటి కింద రాయిలా ఈ ఏడాది పండగకు నిత్యావసర వస్తువులు.. కూరగాయలు.. రొయ్యలు, చేపలు, మాంసాహారాలు.. బస్సు టిక్కెట్లు, వెండి, బంగారాలు ఇలా ప్రతీ ధరలు నింగినంటడంతో సామాన్యులకు పండుగ భారంగా మారింది.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నగదు బదిలీ పథకాల వల్ల ప్రజల చేతుల్లో నాలుగు డబ్బులు కనపడేవి. దీంతో వారిలో కొనుగోలు శక్తి పెరిగి నగదు చెలామణీ జరిగేది. ప్రభుత్వం మారాక నగదు బదిలీలు లేకపోవడం.. ప్రజల చేతుల్లో డబ్బులు ఆడకపోవడంతో ఏం కొనాలన్నా నాలుగుసార్లు ఆలోచించాల్సిన దుస్థితి నెలకొంది. హతవిధీ.. ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వంతో మూల్యం చెల్లించుకుంటున్నామని ప్రజలు ఆలోచనలో పడ్డారు.
పిండి వంటలకు ధరా ఘాతం
నూనె, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. పిండి వంటల పేరు చెబితేనే సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. 2024 పండగతో పోల్చుకుంటే ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు కిలో వంట నూనె ధర సగటున రూ.140 వరకు ఉండగా నేడు రూ.160కి పెరిగింది. కందిపప్పు రూ.120, మినపప్పు కేజీ రూ.80 నుంచి రూ.110, పెసరపప్పు రూ.90 నుంచి రూ.120 వరకు పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం తాజాగా చిక్కీ గోధుమ పిండి ఇస్తామని కేవలం అమలాపురం పట్టణంలో 11,634 కార్డుదారులకు మాత్రమే పరిమితం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాణ్యమైన బియ్యం (ఫోర్టిఫైడ్) అందించేవారు. అరకిలో పంచదార, కిలో చొప్పున కందిపప్పు, గోధుమ పిండిని వినియోగదారులకు అందజేసేవారు. బాబు వచ్చిన తరువాత కందిపప్పును నిలిపివేశారు.
రాకపోకల్లో బాదుడు..
సంక్రాంతి పండగ సమయంలో హైదరాబాద్, చైన్నె, బెంగుళూరు, ముంబై వంటి ప్రాంతాలలో ఉన్నవారు తమ సొంతూళ్లు అయిన గోదావరి జిల్లాలకు పెద్ద ఎత్తున వస్తుంటారు. వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ఆర్టీసీ బస్సులు, రైళ్లు సీట్లు లేకపోవడం ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల భారీ దోపిడీకి గురవుతున్నారు. హైదరాబాద్ నుంచి అమలాపురానికి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టిక్కెట్ ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి. బస్సులలో నాన్ ఏసీ సీటింగ్ రూ.1,500 నుంచి రూ.1,800 వరకు ఉంది. నాన్ ఏసీ స్లీపర్ టిక్కెట్ ధర రూ.1,800 నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. ఇక ఏసీ బస్సు సీటింగ్ ధర రూ.రెండు వేల నుంచి రూ.2,800 వరకు ఉంది. స్లీపర్ టిక్కెట్ ధర రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల వరకు పలుకుతోంది. తొమ్మిదో తేదీన అయితే ఏకంగా రూ.2,600 నుంచి రూ.నాలుగు వేల వరకు ఉండడం గమనార్హం. తిరిగి ఎక్కువ మంది వెళ్లే జనవరి 18వ తేదీన నాన్ ఏసీ, ఏసీ సీటింగ్ ధర రూ.1,500 నుంచి రూ.2,500 వరకు ఉండగా, స్లీపర్ ధరలు రూ.2,500 నుంచి రూ.ఐదు వేల వరకు ఉండడం గమనార్హం.
పండగ కానుకలు లేవు
రేషన్ దుకాణాల ద్వారా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బియ్యంతో పాటు పంచదార, నెయ్యి, ఆయిల్, కందిపప్పు, గోధుమపిండి పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పండుగనే కాకుండా ఇతర రోజుల్లోనూ కూడా ఒక బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతి వస్తువు అధిక ధరలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. బయట నిత్యావసర వస్తువులు మండిపోతున్నాయి.
– మట్టపర్తి విజయ్ కుమార్, గంగలకురు
అగ్రహారం, అంబాజీపేట మండలం
కోడి.. చేప.. రొయ్య..
ఆలోచనే రానంతగా..
సంక్రాంతి పండగ ప్రభావంతో కోళ్లకు డిమాండ్ పెరిగింది. పందెం కోడి పుంజు రకాన్ని బట్టి రూ.ఐదు వేల నుంచి రూ.50 వేల వరకు ధర ఉంది. నాటు కోడి పెట్ట రకాన్ని బట్టి రూ.1,500 నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. బ్రాయిలర్ లైవ్ ధర రూ.190 వరకు ఉండగా, లేయర్ లైవ్ ధర రూ.120 పలుకుతోంది. ఇక మాంసం ధరలకు వస్తే బ్రాయిరల్ కేజీ రూ.300 వరకు ఉండగా, లేయర్ కేజీ రూ.240 వరకు చేరింది. వనామీ రొయ్యల ధర 100 కౌంట్ కేజీ ధర రూ.250 వరకు ఉండగా, చందువా చేప కిలో రూ.500, పండగొప్ప రూ.400 వరకు పలుకుతోంది.
బంగారం.. వెండి.. గతకాలపు మాటేనేమో..
అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న సంక్షోభంతో బంగారం, వెండి ధరలు ఆకాశానికి ఎగబాకాయి. సంక్రాంతి పండగ సమయంలో ఎంతో కొంత బంగారం, వెండి కొనుగోలు చేయడం రైతులకు, కాస్త స్తోమత ఉన్నవారికి, మధ్య తరగతి వారికి ఆనవాయితీ. కాని ప్రస్తుత మార్కెట్‌లో 22 క్యారెట్ గ్రాము ధర రూ.12,900 వరకు ఉంది. కాసు (ఎనిమిది గ్రాములు) ధర రూ.1,03,200 వరకు పలుకుతోంది. రెండేళ్ల క్రితం పండగ సమయంలో కాసు బంగారం ధర రూ.46,840. రెండేళ్ల క్రితం కేజీ వెండి ధర రూ.75 వేలు కాగా, ప్రస్తుత ధర రూ.2.75 లక్షలు. కలలో కూడా ఊహించని ధర ఇది.
కార్తికం కన్నా తగ్గినా.. ఇప్పటికీ కూర‘గాయాలే’
కార్తిక మాసంతో పోలిస్తే ఇప్పుడు కూరగాయల ధరలు తగ్గాయి. అయినా సామాన్యులు కొనే స్థాయిలో లేవు. మార్కెట్‌లో కిలో బీరకాయల ధర రూ.50 వరకు ఉండగా, దొండకాయలు రూ.50, క్యాబేజీ రూ.35, క్యాప్సికం రూ.90, బీట్రూట్ రూ.55, క్యారెట్ రూ.50, మామిడికాయలు రూ.160 వరకు ఉంది. పచ్చిమిర్చి రూ.40 వరకు ఉండగా, కొత్తిమీర కట్ట రూ.25 పలుకుతోంది. ఉల్లిపాయలు కేజీ రూ.25 నుంచి రూ.30 వరకు ధర పలుకుతోంది. తెల్ల బీన్స్ గింజలు రూ.250 వరకు ఉంది.
మూల్యం చెల్లించాల్సిందే!
మూల్యం చెల్లించాల్సిందే!
మూల్యం చెల్లించాల్సిందే!
మూల్యం చెల్లించాల్సిందే!
మూల్యం చెల్లించాల్సిందే!
మూల్యం చెల్లించాల్సిందే!
మూల్యం చెల్లించాల్సిందే!


