యువతకు అండగా ఉంటా
● మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్
● జాబ్‌మేళాకు విశేష స్పందన
● తరలివచ్చిన 4,850 మంది
నిరుద్యోగ యువతీ యువకులు
● పాల్గొన్న సుమారు 70 కంపెనీలు
రాజమహేంద్రవరం సిటీ: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఎటూ దిక్కుతోచని పరిస్థితుల్లో యువత కొట్టుమిట్టాడుతున్నారని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ధ్వజమెత్తారు. జగనన్న తరఫున తన వంతు కర్తవ్యంగా స్థానిక హోటల్ మంజీరా సరోవర్‌లో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు వేలాదిగా నిరుద్యోగులు తరలివచ్చారని భరత్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 70 సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించగా సుమారు 4,850 మంది యువతీ యువకులు తరలివచ్చారన్నారు. వారిలో ప్రతిభ కలిగిన సుమారు 450 మందికి నియామక పత్రాలు అందచేశామన్నారు. తదుపరి రెండో రౌండ్ ఇంటర్వ్యూ లు జరుగుతాయని అప్పుడు సుమారు 400 మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉందన్నారు. ఉద్యోగం రాని యువత కంగారు పడాల్సిన అవసరం లేదని, ఉద్యోగ విషయంలో వాళ్లకు నేను ఎప్పుడూ సహకరిస్తానని హామీ ఇచ్చారు.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి హామీలకు పాతరేసి నిరుద్యోగ యువతను త్రిశంకు స్వర్గంలో నిలబెట్టారన్నారు. సిటీ ఎమ్మెల్యే హంగు, ఆర్భాటం తప్ప ఇంకేమి లేనట్టు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భరత్ అనే నేను సిటీ ప్రజల సంక్షేమం కోసం, వారి శ్రేయస్సు కోసం, యువత శ్రేయస్సు కోసం పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ జగనన్న ఆదేశాల మేరకు పని చేస్తూనే ఉంటానన్నారు. ఈ పండుగ సమయంలో ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, భగవంతుని ఆశీస్సులు మన అందరి మీద, జగనన్న కుటుంబం మీదా ఉండాలని ఆయన ఆకాక్షించారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ఈ విధమైన కార్యక్రమాలు చేయడం గర్వ కారణమన్నారు. త్వరలో కోనసీమ జిల్లాలో జాబ్‌మేళాకు చర్యలు చేపడతామన్నారు.
మాజీ ఎమ్మల్యే తలారి వెంకటరావు, శ్రీనివాస్ నాయుడు, రౌతు సూర్యప్రకాశ రావు, తూర్పు గోదావరి జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ భరత్‌రామ్ పిన్న వయస్సులో ఈ విధమైన కార్యక్రమం చేయడం మాకు ఎంతో గర్వకారణమన్నారు. ముగ్గుల పోటీలు పెట్టి బహుమతులను ఇవ్వడం మంచిదే అయినప్పటికీ, ఉద్యోగ అవకాశాలు లేక యువత ఎంత బాధ పడుతున్నారో, వారి కుటుంబాలు ఎంత క్షోభకు గురవుతున్నాయో ఈ అంధ ప్రభుత్వానికి కనపడటం లేదని ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలు, మోసపూరిత మాటలు వీటితో అధికారం చేపట్టి ప్రజా సమస్యలను విస్మరించి కేవలం అక్రమ సంపాదనే ధ్యేయంగా ఇసుక మాఫియా, మద్యం మాఫియా, హత్యలు, మానభంగాలు, బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు ఇలా నిరంకుశ పాలనతో ప్రజలను హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, ప్రజలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ఎంపీ పల్లి సుభాస్‌చంద్రబోస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


