బ్లో అవుట్ ఘటనపై నేడు కలెక్టర్ సమీక్ష
మలికిపురం: మండలంలోని ఇరుసుమండ గ్రామంలో సంభవించిన బ్లో అవుట్ ఘటనపై లక్కవరంలో ఆదివారం ఉదయం 12 గంటలకు బాధిత గ్రామాల ప్రజలతో కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ సమీక్షించనున్నారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ల సమక్షంలో బాధితులతో ఈ సమీక్ష ఉంటుందని తహసీల్దారు టి.శ్రీనివాసరావు శనివారం తెలిపారు.
దృక్ సిద్ధాంతం మేరకే
పండగల నిర్ణయం
అమలాపురం రూరల్: పండగల తేదీల్లో తేడాలు రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని బండారులంకకు చెందిన పంచాంగకర్త కాలెపు భీమేశ్వరరావు కోరారు. వివిధ పంచాంగాలలో వేర్వేరు తేదీలలో పండగలను సూచించడమే ఇందుకు కారణమన్నారు. శనివారం ఆయన దీనిపై వివరణ ఇస్తూ ఈ విధమైన నిర్ణయాల్లో తేడా రాకుండా 1956లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ధృక్ పద్ధతి సరైనదని తీర్మానించారని, ఆ తీర్మానాన్ని అనుసరించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
రత్నగిరిపై భక్తుల రద్దీ
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది
● స్వామివారి వ్రతాలు 2,100 నిర్వహణ
● దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రారంభమవడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో స్వామివారి ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంత మండపాలు అన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించినట్టు అధికారులు అంచనా వేశారు. స్వామివారి వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదువేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భోజన సౌకర్యం కలుగచేశారు. కాగా, ఆదివారం ఉదయం పది గంటలకు ఆలయ ప్రాకారంలో టేకు రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఊరేగిస్తారు.
వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యునిగా
సత్యనారాయణరాజు
సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన కుందరాజు సత్యనారాయణరాజుకు అవకాశం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయి. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా రాజోలుకు చెందిన కుందరాజు సత్యనారాయణరాజును నియమించారు.
ఫ్లెమింగో ఫెస్టివల్‌కు
రాము కార్టూన్
అమలాపురం రూరల్: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పులికాట్ సరస్సు సమీపంలో జనవరి 10, 11 తేదీల్లో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌కు మండలంలోని బండారులంకకు చెందిన ప్రముఖ కార్టూనిస్టు మాడా రాము గీసిన కార్టూన్ అర్హత సాధించింది. రాష్ట్ర కార్టూనిస్టుల సంఘం సమర్పణలో మండల విద్యా, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో వ్యంగ్య చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో పర్యావరణ రక్షణ, వన్యప్రాణుల, వృక్ష సంపద ఆవశ్యకత అంశంపై రాము గీసిన కార్టూన్ పెట్టనున్నారు. వివిధ ప్రదర్శనలతో పాటుగా, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వంద కార్టూన్లను ప్రదర్శనలో ఉంచారు.
బ్లో అవుట్ ఘటనపై నేడు కలెక్టర్ సమీక్ష


