ప్రయాణాల్లో మహిళలు అప్రమత్తం
● అపరిచితుల మాటలు నమ్మవద్దు
● ఊళ్లకు వెళ్లేవారు ‘ఎల్‌హెచ్‌ఎంఎస్’ను
సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి
అమలాపురం టౌన్: సంక్రాంతి పండగల సందర్భంగా ప్రయాణాలు చేసే మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. జిల్లా పోలీస్ శాఖ హెచ్చరిక అంటూ విడుదలైన ఈ ప్రకటనలో ఊళ్లకు వెళ్లే మహిళలు తమ విలువైన నగలు, నగదును లగేజీ బ్యాగ్‌లు, హ్యాండ్ బ్యాగ్‌లలో పెట్టుకుని ఆటోలు బస్సుల్లో ప్రయాణిస్తుంటారని, అటువంటి సమయంలో మీ పక్కన కూర్చున్న మహిళలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిమ్మల్ని, మీ దృష్టిని ఏమార్చి బ్యాగ్‌లలోని విలువైన వస్తువులు దొంగిలించే అవకాశం ఉంటుందని, అపరిచిన ఆడవారి మాటలు నమ్మవద్దని పేర్కొన్నారు. అలాగే సంక్రాంతి పండుగలకు ఊళ్లకు వెళ్లే వారు ఇంట్లోని తమ విలువైన బంగారు నగలు, డబ్బులు తదితర వాటిని సాధ్యమైనంత వరకూ మీ బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచవద్దని, అనివార్య పరిస్థతుల్లో పోలీసులు సమకూర్చే ‘లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కార్యాలయం సూచించింది. ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ యాప్ డౌన్ లోడ్, పోలీసుల నిర్వహణ అంతా పూర్తి ఉచితం, ఎలాంటి డబ్బులు చెల్లించనవసరం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుని మీరు ఊళ్లకు వెళ్లడం వల్ల పోలీసులు మీ ఇంటిపై పూర్తి నిఘా ఉంచి దొంగతనాలు జరగకుండా చూస్తారని జిల్లా ఎస్పీ కార్యాలయం స్పష్టం చేసింది.


