ప్రభల ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
కొత్తపేట: కోనసీమ జిల్లాలో సంక్రాంతి ప్రభల ఉత్సవాలను ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా, ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఉత్సవ కమిటీలకు సూచించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే ప్రభల ఉత్సవాలకు భిన్నంగా కొత్తపేటలో అనాదిగా మకర సంక్రాంతి పర్వదినం నాడు ప్రభల ఉత్సవాలు, ఆ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాల్పులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ మేరకు ఈ నెల 15న జరిగే ఉత్సవాల తీరుతెన్నుల గురించి శనివారం సాయంత్రం ఎస్పీ రాహుల్ మీనా స్థానికంగా డీఎస్పీ సుంకర మురళీమోహన్, పోలీసు అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా ఎంత సేపు ఉత్సవాలు జరుగుతాయి.. బాణసంచా కాల్పులు.. ఎన్ని వేల మంది జనం తరలివస్తారనే అంశాలపై చర్చించారు. కొత్తపేటలో ప్రభల విడిది, బాణసంచా కాల్చే ప్రదేశాలు పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. 2 వీలర్, 4 వీలర్ వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ డైవర్షన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ చారిత్రాత్మక ప్రభల తీర్థానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ నెల 16న కనుమ పండుగ రోజున జరిగే ప్రభల తీర్థాలకు తగిన బందోబస్తు నిర్వహించాలన్నారు. వారి వెంట ఎస్సై జి.సురేంద్ర తదితరులు ఉన్నారు.


