ఆలయ పూజారిపై కత్తితో దాడి
తాళ్లరేవు: మండలంలోని జార్జిపే ట రామాలయం పూజారిపై కత్తితో దాడి జరిగింది. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ కథనం ప్రకారం.. ఐ.పోలవరం మండలం గుత్తెనదీవికి చెందిన ఇంద్రగంటి వీర వెంకట సత్య సూర్యసుబ్రహ్మణ్య సుందరేశ్వరశర్మ జార్జిపేట రామాలయం పూజారిగా పనిచేస్తున్నారు. శనివారం ఉదయమే ఆలయానికి వచ్చిన శర్మ 9.30 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లి తిరిగి ఆలయంలోకి వెళ్లేందుకు బయట కాళ్లు కడుగుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన కొండమూరి శివయ్య కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో పూజారి చేతులపై, ఉదరంపై తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు హుటాహుటిన యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపా రు. పాత కక్షల నేపథ్యంలోనే శివయ్య పూజారిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.


