కాలువలో మహిళ మృతదేహం
రావులపాలెం: మండలంలోని గోపాలపురం గ్రామ ప్రధాన పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని శనివారం పోలీసులు గుర్తించినట్టు ఎస్సై కేవీ రమణారెడ్డి తెలిపారు. మృతురాలి వయసు సుమారు 50 నుంచి 55 ఏళ్లు ఉంటుందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించామని ఎస్సై వివరించారు. ఆమె వంటిపై ఎరుపు రంగు జాకెట్, ఎరుపు రంగు చీర ఉందన్నారు. కాలువ ఎగువ ప్రదేశం నుంచి ప్రమాదవశాత్తూ జారి పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మరిన్ని వివరాలకు రావులపాలెం పోలీస్ స్టేషన్ సీఐ 94407 96567, ఎస్సై 99890 32059 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.


