వెదజల్లుల్లో సీమసాగు..!
పెట్టుబడి కలసివస్తోంది
వెదజల్లు పద్ధతిలో ఒక్క రోజులోనే.. ఒక్క మనిషితో ఎకరాకు సరిపడా విత్తనాలు చల్లిస్తున్నాం. ఎకరాకు ఎలా చూసినా రూ.ఐదు వేలకు పైబడి పెట్టుబడి మిగులుతోంది. నేను నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నాను. ఈ విధానం వల్ల రూ.20 వేలకు పైబడి పెట్టుబడి మిగులుతోంది. రెండు బస్తాలు (60 కేజీలు) విత్తనం కూడా కలిసి వస్తోంది.
– జి.నారాయణ, కేశనకుర్రు,
ఐ.పోలవరం మండలం
● మూడొంతుల రైతులది ఇదే పద్ధతి
● కూలీల కొరతకు ఉత్తమ విధానం
● తగ్గుతున్న పెట్టుబడి వ్యయం
● స్వల్ప కాలంలోనే అధిక దిగుబడి
● మిగిలిన చోట్ల బెంగాలీలతో ఊడ్పులు
● జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో రబీ సాగు
● ఇప్పటి వరకు 41,404 ఎకరాల్లో సాగు
ఐ.పోలవరం/ఉప్పలగుప్తం: గోదావరి డెల్టాలో రబీ సాగు ఆలస్యమైంది. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 31 నాటికి నాట్లు, వెదజల్లులు పూర్తి కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం పావు వంతు మాత్రమే పూర్తయ్యాయి. పరిస్థితి చూస్తుంటే జనవరి నెలాఖరు వరకు నాట్లు పడేలా ఉంది. కూలీల కొరతకు తోడు పెరుగుతున్న పెట్టుబడులను తగ్గించుకునే ఉద్దేశంతో రబీ రైతులు పలు యత్నాలు మొదలుపెట్టారు. వీరిలో చాలా మంది వెదజల్లును ఆశ్రయిస్తుండగా, మరి కొంతమంది బెంగాలీ కూలీలతో నాట్లు వేయిస్తున్నారు.
జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టా పరిధిలో 1.70 లక్షల ఎకరాల్లో రబీ సాగవుతోందని అధికారుల అంచనా. కాని ఇంత వరకు కేవలం 41,404 ఎకరాలలో వెదజల్లు, నాట్లు వేశారు. దీనిలో 8,027 ఎకరాల్లో నాట్లు కాగా, 33,377 ఎకరాల్లో వెదజల్లు, మరో 3,643 ఎకరాలకు సరిపడా నారుమడి ఉంది.
మూడొంతులు వెదజల్లు
డెల్టాలో మూడు వంతులు వెదజల్లు పద్ధతిలో సాగు చేస్తున్నారు. నాట్లు వేయడం రైతులకు వ్యయ, ప్రయాసలతో కూడుకున్న అంశంగా మారింది. ఎకరాకు స్థానిక కూలీలతో మడిలో విత్తనం చల్లడం, నారు సేకరణ, నాట్లు వేయడానికి సుమారు రూ.ఎనిమిది వేల వరకు ఖర్చవుతోంది. అదే వెదజల్లు పద్ధతిలో ఒక్క మనిషితో విత్తనాలు చల్లిస్తున్నారు. ఇందుకు రూ.ఏడు వందల నుంచి రూ.వెయ్యి వరకు ఖర్చవుతోంది. ఇక్కడే రైతుకు రూ.ఏడు వేల వరకు మిగులుతోంది. వెదజల్లులో విత్తన వినియోగం కూడా చాలా తక్కువ. సాధారణ నారుమడి పద్ధతిలో 30 కేజీల విత్తనం వాడుతుండగా, వెదజల్లుకు 12 నుంచి 15 కేజీలు సరిపోతోంది. దీనికి తోడు పంట కూడా 10 నుంచి 15 రోజుల ముందే దిగుబడి వస్తోంది. ఇన్ని ప్రయోజనాలు ఉండడం, ప్రధానంగా కూలీల కొరత అధిగమించే అవకాశం ఉండడంతో రైతులు ఈ విధానానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ విధానంలో కలుపు ఎక్కువ వచ్చే అవకాశముందని కొందరు రైతులు ఆ పద్ధతికి దూరంగా ఉంటున్నారు. కాని వెదజల్లు అన్ని విధాలుగా మంచిదని, కలుపును కూడా సమర్ధవంతంగా నివారించేందుకు మందులు, ఉత్తమ యజమాన్య పద్ధతులున్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
వెదజల్లుల్లో సీమసాగు..!
వెదజల్లుల్లో సీమసాగు..!


