యువజన నేతల నిర్బంధం దారుణం
● వారిపై అక్రమ కేసులు రద్దు చేయాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా యువజన
విభాగం అధ్యక్షుడు సూర్యప్రకాష్
● కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాల ధర్నా
అమలాపురం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, వాటి అమలు కోసం ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ రౌడీషీట్లు తెరుస్తున్నారని వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల, విద్యార్థి సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్త విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం, పార్టీ యువజన విభాగం, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ అధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం వారు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీసీ జిల్లా యువజ విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థి, యువకులపై దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ప్రశ్నించే వారిని అణచి వేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తోందని, రౌడీషీట్లు తెరుస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం తన నిరంకుశ విధానాలాను విరమించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు. పి.గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు, యువకులను ఇబ్బందిపెట్టిన ఏ ప్రభుత్వం నిలబడినట్టు చరిత్రలో లేదన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు మాట్లాడుతూ పక్షం రోజుల క్రితం విద్యార్థి యువజన సంఘాల నాయకులతో సమావేశమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థి సమస్యలు పరిష్కరిస్తానని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నెల రోజులు గడవకముందే ప్రశ్నించి ఉద్యమిస్తున్న విద్యార్థి, యువకులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ అనేక దేశాలలో విద్యార్థులు ఉద్యమించి ప్రభుత్వాన్ని కూల్చిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలన్నారు. నిరసన ప్రదర్శన అనంతరం వారంతా డీఆర్‌ఓ కొత్త మాధవికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యుడు కుడుపూడి భారత్‌భూషణం, పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సంసాని బులినాని, అంబాజీపేట వైఎస్సార్ మండల అధ్యక్షుడు విత్తానాల శేఖర్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు ములపర్తి శ్రీను, రాష్ట్ర యువజన విభాగం అధికారి ప్రతినిధి ఉండరాల సంతోష్‌కుమార్, విద్యార్థి విభాగం రిజినల్ కోర్టినేటర్ జిల్లేళ్ల రమేష్, రామచంద్రపురం నియోజకవర్గం విద్యార్థి, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు రవికుమార్, యువత విభాగాల అధ్యక్షులు గుత్తుల రమేష్, మాదిరెడ్డి పృథ్వీరాజ్, వివిధ విభాగాల అధ్యక్షులు బూల పృథ్వీరాజు, విత్తానాల రమేష్, రాజులపూడి మురళీకృష్ణ, గొవ్వాల రమేష్, దొంగ చిన్నా, గోపి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
యువజన నేతల నిర్బంధం దారుణం


