ఇంటర్మీడియెట్ పరీక్షలపై సమీక్ష
అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్‌లో నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్యకు సంబంధించి జరిగే పబ్లిక్ పరీక్షలపై డీఐఈవో కె.చంద్రశేఖర్‌బాబు గురువారం ఏఎస్‌ఎన్ కళాశాలలో జిల్లాలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్షించారు. ఈనెల 21న నైతికత, మానవ విలువలు, 23న పర్యావరణ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. వీటికి జిల్లాలోని 123 జూనియర్ కళాశాలల నుంచి 13,131 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరూ కచ్చితంగా ఈ పరీక్షల్లో అర్హత సాధించాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో వారికి ఇంటర్ పరీక్షల ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం జారీ కాదని తెలిపారు. గతంలో ఇంటర్మీడియెట్ చదివి ఈ పరీక్షల్లో అర్హత సాధించని విద్యార్థులు ఎవరైనా ఉంటే, వారు కూడా హాజరు కావచ్చని వివరించారు. ఆ విద్యార్థులు ఏ కళాశాలలో చదివారో అక్కడే పరీక్ష రాయాలన్నారు. ఈ నిబంధనలపై అవగాహన కల్పించాలని జిల్లాలోని జూనియర్ కళాశాలల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల కమిటీ సభ్యులు వై.లక్ష్మణరావు, జె.శాంతకుమారి, కె.శ్రీనివాస రావు, వై.సుబ్బారావు, బి.సింహాద్రి ప్రసంగించారు. సమావేశంలో ఏఎస్‌ఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏవీఎస్ మహాలక్ష్మి పాల్గొన్నారు.
ఎంఎస్‌ఎంఈ కాంప్లెక్స్
పురోగతిపై సమీక్ష
అమలాపురం రూరల్: జిల్లాలో ఎంఎస్‌ఎంఈ ప్లాటిడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ప్రాజెక్టు పురోగతి, భూసేకరణ స్థితి, ఎంఓయూ తుది రూపం, అనుమతుల పొందడం కోసం ప్రతి నెలా జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి తరచూ సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద అమరావతి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ పారిశ్రామికవేత్తలకు వేగంగా పారిశ్రామిక స్థలాలు అందేలా సమన్వయం చేయాలన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో రెండు ఎకరాలు, అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలంలో 6.83 ఎకరాల ప్రభుత్వ భూమి, కొత్తపేట నియోజకవర్గంలో దేవరపల్లిలో 5 ఎకరాలు, రాజోలు నియోజకవర్గంలో రెండు ఎకరాలు గుర్తించి సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో రైతులతో భూసేకరణకై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.
ఇంటర్మీడియెట్ పరీక్షలపై సమీక్ష


