ఎన్నికల హామీలను అడిగితే కేసులా?
● చంద్రబాబు ప్రభుత్వ తీరు దారుణం
● వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాశ్
● నేడు కలెక్టరేట్ వద్ద నిరసన
రామచంద్రపురం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన విభాగాల నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేసులు పెట్టడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, పార్టీ రామచంద్రపురం కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ ధ్వజమెత్తారు. పట్టణంలోని గాంధీపేటలో గల పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు గడుస్తున్నాయన్నారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిని ఇవ్వాలని విద్యార్థి సంఘాలు అడిగితే తట్టుకోలేకపోతున్నారన్నారు. అలా ప్రశ్నించిన విద్యార్థులపై రౌడీషీట్లు ఓపెన్ చేయటం ఎంతవరకు సమంజసమని అడిగారు. జాబ్ కేలండర్ విడుదల చేయా లని విజయనగరం జిల్లాలో నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నేతలపై కేసులు బనాయించడం దారుణమన్నారు. ప్రభు త్వ తీరుకు నిరనసనగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిరసన చేపడతామన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగాల నేతృత్వంలో ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.


