ఆస్పత్రుల్లో శానిటేషన్ వర్కర్ల శ్రమ దోపిడీ
అమలాపురం టౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ వర్కర్లతో కలిసి సీఐటీయూ జిల్లా ప్రతినిధులు గురువారం అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.దుర్గాప్రసాద్, నూకల బలరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు జీవో ప్రకారం రూ.18,600 జీతం ఇవ్వాలన్నారు. దానిలో పీఎఫ్, ఈఎస్‌ఐలకు రూ.2600 తీసివేయగా రూ.16 వేలు చొప్పున చెల్లించాలన్నారు. కానీ మధ్యలో ఉన్న కాంట్రాక్టర్ ఆ వర్కర్లకు రూ.10 వేలు మాత్రమే ఇస్తూ, వారి సొమ్మును, శ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ సమస్యపై కార్మిక మంత్రి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌లకు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. రావాల్సిన జీతాల గురించి అడిగినందుకు అమలాపురం ఏరియా ఆస్పత్రిలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఐదుగురి వర్కర్లను తొలగించారన్నారు. అమలాపురం ఏరియా ఆస్పత్రి పేరుకు 100 పడకల ఆస్పత్రిగా రికార్డుల్లో ఉన్నప్పటికీ 60 పడకలే ఉన్నాయన్నారు. దీంతో అదనంగా ఉన్నారన్న వంకతో ఆ ఐదుగురి వర్కర్లను అన్యాయంగా తొలగించారని ఆరోపించారు. వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ధర్నాలో నినాదాలు చేశారు. వర్కర్ల పీఎఫ్, ఈఎస్‌ఐ సొమ్ములను గత కాంట్రాక్టర్ కట్టలేదని, ఆ కాంట్రాక్టర్ నుంచి సొమ్ములను రికవరీ చేయాలని నినాదాలు చేశారు. కాంట్రాక్టర్లు సొమ్ములు దోచుకునే విధానానికి స్వస్తి పలికాలన్నా రు. పరిిస్థితి ఇలానే కొనసాగితే సీఐటీయూ తరఫున వర్కర్లకు అండగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.


