ఆరని చిచ్చు
● బ్లోఅవుట్లతో కోనసీమ బెంబేలు
● పచ్చని జిల్లాలో చమురు చిచ్చు
● పాశర్లపూడి ఘటనకు 31 ఏళ్లు
● ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న ప్రజలు
నిద్రలేని రాత్రులు
మా ఇంటి నుంచి గ్యాస్ పైప్‌లైన్ వెళ్లింది. భారీ శబ్దం మా ఊరి వరకు వినిపించింది. మా వద్ద పైప్‌లైన్ పేలిందేమోనని భయపడ్డాం. కానీ దేవర్లంక వద్ద అని తర్వాత తెలిసింది. అది మా ఊరికి దూరమే అయినా 65 రోజులు పాటు నిద్రలేని రాత్రులు గడిపాం.
– సోమరపల్లి పద్మనీ కుమార్,
ఇమ్మిడివరప్పాడు, అమలాపురం మండలం.
పాశర్లపూడి బావి బ్లో అవుట్ (ఫైల్)
సాక్షి, అమలాపురం: కోనసీమ పేరు వినగానే పచ్చని పొలాలు, ఎత్తయిన కొబ్బరి చెట్లు, గలగలపారే గోదావరి గుర్తుకు వస్తాయి. ఇక్కడి వాతావరణం కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటుంది. కోనసీమలో నివసిస్తే ఎంత బాగుంటుందో అని సగటు పర్యావరణ అభిమానులు కోరుకుంటూ ఉంటారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇది పైకి కనిపించే కోణం మాత్రమే. చమురు సంస్థల కార్యకలాపాలతో కుంపటిపై కోనసీమ విలవిల్లాడుతోంది. ప్రస్తుతం మలికిపురం మండలం ఇరుసుమండ ఓఎన్జీసీ మోరి బావి–5లో ఏర్పడిన బ్లోఅవుట్‌తో జిల్లా ప్రజలు ఉలిక్కి పడ్డారు. గతంలో 1995 జనవరి 8న పాశర్లపూడిలోనూ బ్లోఅవుట్ ఏర్పడింది. దాన్ని ఆర్పేందుకు 65 రోజుల సమయం పట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద బ్లోఅవుట్‌గా గుర్తింపుపొందిన పాశర్లపూడి ఘటనపై ప్రత్యేక కథనం.
సాంకేతిక లోపం
అల్లవరం మండలం దేవర్లంక (పాసర్లపూడి వద్ద) 19వ సెక్టార్ సైట్‌లో డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో ఏర్పడిన చిన్న సాంకేతిక లోపం భారీ బ్లో అవుట్‌కు దారి తీసింది. ఇది జరిగి నేటికి 30 ఏళ్లు పూర్తవుతోంది. పాశర్లపూడి బ్లోఅవుట్‌గా పేరొందిన ఈ విపత్తు దేశం చమురు, సహజ వాయువుల వెలికితీత చరిత్రలో మాయని మచ్చగా మారింది. ఆ రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ ఘటన చేసుకుంది. అంతకుముందు కోనసీమలో ఒకటి రెండు చోట్ల చిన్న బ్లోఅవుట్లు జరిగినా ఇప్పుడున్నంత సమాచార వ్యవస్థ లేకపోవడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ పాశర్లపూడిలో అణుబాంబు పేలినట్టు భారీ శబ్దంతో గ్యాస్ ఎగదన్ని, మంటలు చెలరేగడంతో సమీప వాసులు ఉలిక్కిపడ్డారు. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీశారు.
రాకాసి మంటలు
పాశర్లపూడి బ్లోఅవుట్ శబ్దం అప్పట్లో సుమారు ఐదు మండలాలకు పూర్తిస్థాయిలో వినిపించింది. వంద మీటర్ల ఎత్తున ఎగసిన రాకాసి మంటలు చూసి ప్రజలు బెంబెలెత్తిపోయారు. సమీపంలోని అల్లవరం, దేవర్లంక గ్రామాలకు చెందిన వందల మంది కట్టుబట్టలతో, ఇళ్లకు తాళాలు కూడా వేయకుండా అక్కడ నుంచి పరుగులు తీశారు. ప్రమాదం సంభవించిన రిగ్గుకు రెండు కిలోమీటర్ల పరిధిలోని ఏడు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపారు. వందలాది కొబ్బరి చెట్లు క్షణాల్లో మాడిమసైపోయాయి. రాత్రి వేళల్లో బ్లో అవుట్ వెలుగు రాజమహేంద్రవరం, కాకినాడ వంటి నగరాలకు కూడా కనిపించేదంటే అతిశయోక్తి కాదు.
ఓఎన్‌జీసీ నిర్లక్ష్యం
అంత పెద్ద బ్లో అవుట్ జరిగినా ఓఎన్జీసీలో ఎటువంటి మార్పు రాలేదు. చమురు, సహజ వాయువుల అన్వేషణ, వెలికితీత వంటి సమయాల్లో తరచూ బ్లో అవుట్‌లు జరుగుతున్నా, గ్యాస్ పైప్‌లైన్లు లీకు అవుతున్నా చీమ కుట్టినట్టయినా లేకుండా పోయింది. మామిడికుదురు మండలం నగరం గ్యాస్ పైప్‌లైన్ లీకేజు కారణంగా 22 మంది మృత్యువాత పడ్డారు. అయినా ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు తమకు పట్టనట్టుగా వ్యవహిస్తున్నాయి.
ఫలించిన వాటర్
అంబ్రెల్లా విధానం
ఓఎన్జీసీ నిపుణులు బ్లోఅవుట్‌ను ఆర్పటానికి శతవిధాలా ప్రయత్నించి చేతులెత్తేశారు. విదేశాల నుంచి నిపుణులను తీసుకువచ్చినా వారి వల్ల కూడా కాలేదు. చివరకు ఓఎన్జీసీ ఫైర్ ఫైటింగ్ విభాగం అధికారి కోటిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలోని క్రైసిస్ మేనేజ్‌మెంట్ బృందం రంగంలోకి దిగింది. ఆయన సూచన మేరకు వాటర్–అంబ్రెల్లా విధానం అమలు చేయబడింది. అన్ని వైపుల నుంచీ బ్లోఅవుట్ పైకి నీళ్లు, నురగ (ఫోమ్) వెదజల్లటం ద్వారా మంటల్ని అదుపు చేయాలని నిర్ణయించారు. చివరకు అదే ఫలించి 36 గంటల్లోపే మంటలు అదుపులోకి వచ్చాయి. అంటే దాదాపు 65 రోజుల తర్వాత మంటలను అదుపు చేయగలిగారు. బ్లో అవుట్ కారణంగా సంస్థకు అప్పట్లో రూ.16 కోట్ల నష్టం వాటిల్లింది.
ఆరని చిచ్చు
ఆరని చిచ్చు


