పిల్లాపాపలతో పరుగులు తీశాం
● బ్లోఅవుట్ బాధితుల ఆవేదన
● ఎమ్మెల్యే దేవకు సమస్యల వినతి
● ‘సాక్షి’ కథనానికి స్పందన
మలికిపురం: ఇరుసుమండలో సంభవించిన బ్లోఅవుట్‌తో బెంబేలెత్తిపోయామని, వెంటనే పిల్లాపాపలను తీసుకుని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశామని బాధితులు వాపోయారు. తమ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే దేవకు తమ ఆవేదనను వెల్లడించారు. కాగా.. పునరావాస కేంద్రాలలో అరకొర సౌకర్యాలు అనే శీర్షికతో జనం పడుతున్న బాధలను బుధవారం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే దేవ ఇరుసుమండ, లక్కవరం కాలనీకి వెళ్లి బాధితులతో మాట్లాడారు. పలువురు మహిళలు మాట్లాడుతూ తమ గ్రామంలోని యువత తమను అప్రమత్తం చేసిందని, ఓఎన్జీసీ కనీసం సైరన్ కూడా వేయలేదన్నారు. కట్టుబట్టలతో పరుగులు తీయడంతో పునరావాస కేంద్రాలలో జీవశ్చవాలుగా బతికామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓఎన్జీసీ, డ్రిల్లింగ్ సంస్థలతో మాట్లాడతానని, తాత్కాలికంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.3 వేలు, 50 కేజీల బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
భయం భయంగానే..
బ్లో అవుట్ సమీపంలోని ప్రజలు ఇంకా సోమవారం అనుభవించిన నరక యాతన, భయాన్ని పోగొట్టుకోలేకపోతున్నారు. బ్లో అవుట్ మంటలు తగ్గడంతో బుధవారం ఇంటికి చేరుకున్నా వారి కళ్ల ముందు అప్పటి దృశ్యాలే కదలాడుతున్నాయి. వారిని కలవడానికి వెళ్లి ‘సాక్షి’ బృందంతో ఆ విషయాలే పంచుకున్నారు. చాలామంది ఇళ్లకు తిరిగి రాలేదు.
పిల్లాపాపలతో పరుగులు తీశాం


