కొబ్బరి పరిశోధనా కేంద్రం అధిపతి చలపతిరావు బదిలీ
అంబాజీపేట: రాష్ట్రంలోనే ఏకై క కొబ్బరి పరిశోధనా కేంద్రమైన అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా కేంద్ర అధిపతి డాక్టర్ ఎన్.బి.వి.చలపతిరావు బదిలీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ నుంచి ఆదేశాలు వచ్చాయని ఆయన సోమవారం తెలిపారు. విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉద్యాన సమాచార కేంద్రంలో ప్రిన్సిపల్ సైంటిస్టు హోదాతో పాటు ముఖ్య ప్రజా సంబంధ అధికారిగా నియమించారన్నారు. కర్నూ లు జిల్లా నంద్యాలలోని మహానంది ఉద్యాన పరిశోధనా కేంద్రం అధిపతి, ఉద్యాన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.ముత్యాలనాయుడు అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్ర అధిపతిగా బదిలీ అయినట్లు సమాచారం.
సమస్యల పరిష్కారానికి కృషి
బంగారు, వెండి వర్తకుల రాష్ట్ర
అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్‌కుమార్
అమలాపురం టౌన్: రాష్ట్రంలోని బంగారు, వెండి, డైమండ్ వర్తకుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందని ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిలవాయి విజయ్‌కుమార్ అన్నారు. అమలాపురంలోని యెండూరి హైట్స్ కన్వెన్షన్ హాలులో సోమవారం జరిగిన రాష్ట్ర అసోసియేషన్ 3వ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. విజయకుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14న జరిగే రాష్ట్ర అసోసియేషన్ 4వ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం తిరుపతిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా బులియన్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ జైన్, జిల్లా బులియన్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ను సత్కరించారు. రాష్ట్ర అసోసియేషన్ చీఫ్ ఆర్గనైజర్ శాంతి లాల్జీ జైన్, రాష్ట్ర కార్యదర్శి బీఎంఆర్ శంకర్, అమలాపురం అసోసియేషన్ అధ్యక్షుడు మేడిచర్ల త్రిమూర్తులు, కార్యదర్శి రాయుడు నాని, అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్య వర ప్రసాద్ పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్
సప్లిమెంటరీ పరీక్షలు
అమలాపురం టౌన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్ విద్యార్థులకు తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలు, ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు తొలి రోజు జరిగాయని పేర్కొన్నారు. ఉదయం ప్రథమ సంవత్సరం మొత్తం జనరల్ ఇంటర్మీడియెట్ విద్యార్థులు 2004 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 1,878 మంది హాజరయ్యారు. ఒకేషనల్ ఇంటర్ విద్యార్థులు 297 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 249 మంది రాశారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం మొత్తం జనరల్ ఇంటర్ విద్యార్థులు 295 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 264 మంది రాశారు. ఒకేషనల్ ఇంటర్ విద్యార్ధులు 135 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 123 మంది రాశారు. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనతో పాటు జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు సిటింగ్ స్క్వాడ్స్, కస్టోడియన్స్ పర్యవేక్షించారని తెలిపారు.
సరస్వతీ నదీ పుష్కరాలకు
ప్రత్యేక బస్సులు
రావులపాలెం: సరస్వతీ నదీ పుష్కరాలకు సంబంధించి రావులపాలెం ఆర్‌టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ జీజీవీ రమణ సోమవారం తెలిపారు. రావులపాలెం డిపో నుంచి వరంగల్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామప్ప దేవాలయాల దర్శనాలతో పాటు సరస్వతీ నదిలో పుష్కర స్నానం చేసే విధంగా రెండు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఈ నెల 15వ తేదీన రావులపాలెం నుంచి బయలుదేరుతున్నట్టు తెలిపారు. ప్రయాణికుల నుంచి విశేష స్పందన ఉన్న కారణంగా ఈ నెల 20వ తేదీన మరో రెండు బస్సులు పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. పై క్షేత్రాలు దర్శనం అనంతరం మొదటి సర్వీసులు 22వ తేదీ రావులపాలెం చేరుతాయన్నారు. టిక్కెట్ ధర రూ.2,200గా నిర్ణయించామన్నారు. వేసవి సెలవుల సందర్భంగా విహారయాత్రలకు, తీర్థయాత్రలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్గో సేవలు కూడా విస్తృతం చేశామని ఒక కేజీ నుండి 10 టన్నుల వరకు మామిడి, అరటి, కొబ్బరికాయలు, లగేజీ తక్కువ చార్జీతో భద్రంగా– హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, సాలూరు, విజయనగరం, బెంగళూరు పట్టణాలకు పంపిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 99592 25549, 99893 65239 నంబర్లలో సంప్రదించాలన్నారు.


