
అన్నదాతలో తుపాను గుబులు
రేమాల్ ప్రభావంతో జిల్లాలో వర్షం
సాక్షి అమలాపురం: ‘‘రేమాల్’’ తుపాను ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది తుపానుగా మారి బంగ్లాదేశ్ వైపు కదులుతోందని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావం జిల్లాపై పడింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు దఫదఫాలుగా వర్షం పడింది. వర్షానికి జిల్లా కేంద్రం అమలాపురం తడిసి ముద్దయ్యింది. ఉదయం వేసవి ఎండను తలపించినా సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడింది. ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ఈదురుగాలులకు కొబ్బరి చెట్లు ఊగిపోయాయి. పలుచోట్ల రోడ్ల మీద చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అమలాపురంతోపాటు అంబాజీపేట, అల్లవరం, ఉప్పలగుప్తం, రామచంద్రపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేటలో భారీ వర్షం కురిసింది. అమలాపురం, రామచంద్రపురం పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో రోడ్ల మీద నీరు నిలిచిపోయింది.
ధాన్యం అమ్మకాలకు అవాంతరం
భారీ వర్షం రబీ వరి రైతులు ధాన్యం అమ్మకాలకు అవాంతరంగా మారింది. రబీ వరి కోతలు దాదాపూగా పూర్తయ్యాయి. కాని నూర్పిడులు జరుగుతున్నాయి. రామచంద్రపురంలో మాసూళ్లు జరుగుతున్నా కేవలం 10 శాతం ధాన్యం మాత్రమే రాశుల మీద ఉంది. ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు వ్యవసాయ సబ్ డివిజన్లలో మాత్రమే కోతలు పూర్తయినా ధాన్యం రాశుల మీద అధికంగా ఉంది. బరకాలు కప్పి రైతులు ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకున్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వర్షాల వల్ల చేలల్లో మట్టి పనులు నిలిచిపోయాయి. రైతులు వేసవిలో మట్టిని తొలగించే పనులు చేస్తారు. గట్టు మెరక చేయడంతోపాటు ట్రాక్టర్ల ద్వారా బయటకు తరలిస్తారు. వర్షాల వల్ల ఆ పనులు దాదాపూగా నిలిచిపోయాయి. వర్షం ఉద్యాన పంటలకు మేలు చేసింది. కొబ్బరి, కోకో, కంద, అరటి, పసుపు, కూరగాయల పంటలకు వర్షాల వల్ల మేలు జరిగింది. ఆలమూరు, కొత్తపేట, అయినవిల్లి, మామిడికుదురు, పి.గన్నవరం, రావులపాలెం మండలాల్లో కూరగాయ పంటలకు సైతం వర్షం వల్ల ఊరట కలిగింది. ఎండల నుంచి పంటలు తేరుకున్నాయి.
ఇటుక బట్టీలకు నష్టం
జిల్లాలో ఆలమూరు మండలంలో ఆలమూరు, చొప్పెళ్ల, మూలస్థానం అగ్రహారం, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలం కేదార్లంక, అంగర, అద్దంకివారిలంక, రాయవరం మండలం మాచవరం, అయినవిల్లి మండలం ముక్తేశ్వరం, వీరవల్లిపాలెం, రావులపాలెం మండలం ఊబలంక, ఆత్రేయపురం మండలం అంకంపాలెం, ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఇటుక బట్టీలు వర్షం వల్ల మూతపడ్బాయి. జిల్లాలో సుమారు 700ల వరకు ఇటుక బట్టీలున్నాయి. రోజుకు 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఇటుక తయారవుతోంది. తాత్కాలికంగా బరకాలు వేసి రక్షణ కల్పించినా ఈదురుగాలుల వల్ల ఎగిరిపోయి వర్షానికి ఇటుక తడిసిపోయింది. ‘పచ్చి ఇటుక (కాల్చని ఇటుక) వర్షానికి నాని బురదగా మారిపోతోంది. దీనివల్ల ఇటుకకు రూ.నాలుగు వరకు నష్టం వాటిల్లుతోంది’ అని ఆలమూరుకు చెందిన రావాడ సత్తిబాబు ‘సాక్షి’కి తెలిపారు. మరో రెండు రోజులు వర్షాల వల్ల బట్టీలు తెరుచుకునే అవకాశం లేదు.