ఇంటర్‌ యువతికి బర్త్‌డే విషెస్‌.. నమ్మి వెళితే నరకం చూపించాడు

Young Men Try To Molestation Women In East Godavari - Sakshi

సాక్షి,తూర్పుగోదావరి (కరప): కామంతో కన్నుమిన్ను కానని ఓ యువకుడు యువతిపై లైంగిక దాడికి యత్నం చేసి, విచక్షణారహితంగా గాయపరచిన ఘటన కరప మండలం వేళంగిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరప ఎస్సై డి.రమేష్‌బాబు, స్థానికుల కథనం ప్రకారం.. వేళంగికి చెందిన యువతి ఇంటర్మీడియెట్‌ చదివింది. తల్లిదండ్రులతో కలిసి ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తోంది. ఈ నెల 13 రాత్రి ఆమె ఇంటి పక్కనే ఉంటున్న విత్తనాల రమేష్‌ తన మొబైల్‌ ఫోన్‌ నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

దీనికి కృతజ్ఞతలు తెలిపిన ఆ యువతి.. కొద్దిసేపటికి రూ.2 వేలు అప్పుగా ఇస్తే, నాలుగు రోజుల్లో ఇచ్చేస్తానని అడిగింది. ఇదే అదునుగా నగదు ఇస్తానని నమ్మించిన రమేష్‌.. ఇంటి పక్కన ఉన్న సందులోకి ఆమెను రమ్మ న్నాడు. తెలిసిన వ్యక్తే కదా అని డబ్బుల కోసం అక్కడకు వెళ్లగా అతడు ఆ యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో ఆగ్రహించిన రమేష్‌.. ఆ యువతి గొంతు పట్టుకుని గోడకు గుద్దించాడు. విచక్షణా రహితంగా కొట్టి గాయపర్చాడు. భయపడిన ఆ యువతి కేకలు వేయడంతో ఆమె గొంతు, ఎడమ చేతిని కొరికి గాయపరిచాడు. మెడ పట్టుకొని ముఖా న్ని గోడకు బలంగా కొట్టి పరారయ్యాడు.

ఈ విషయాన్ని తల్లిదండ్రులకు, బంధువులకు బాధితురాలు తెలిపింది. ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి కుడి కన్ను పూర్తిగా దెబ్బతింది. అపస్మారక స్థితిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ చట్టం, ఇతర సెక్షన్లతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రమేష్‌బాబు వివరించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top