రూ.కోటి కోసం బాలుడి కిడ్నాప్‌

Young Man Who Kidnapped Boy Has Been Arrested - Sakshi

పళ్లిపట్టు: రూ.కోటి కోసం కిడ్నాప్‌కు గురైన బాలుడిని పోలీసులు రెండు గంటల్లోనే తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడిని కిడ్నాప్‌ చేసిన యువకుడిని ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఆర్కేపేట ఇస్లాంనగర్‌కు చెందిన బాబు అలియాస్‌ ముబారక్‌(40) షోళింగర్‌లో చికెన్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతనికి పర్వేష్‌(9), రిష్వంత్‌(6), అజరుద్దీన్‌(3) పిల్లలున్నారు. వీరిలో అజరుద్దీన్‌ శనివారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చెందారు.ఈ క్రమంలో ముబారక్‌ సెల్‌కు ఒక ఫోన్‌ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి  రూ.కోటి ఇస్తే బాలుడిని వదిలిపెడగామని బెదిరించాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆర్కేపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీఐ సురేందర్‌కుమార్, ఎస్‌ఐ త్యాగరాజన్‌ వెంటనే వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను అలెర్ట్‌ చేశారు. అదే సమయంలో ముబారక్‌కు వచ్చిన పోన్‌ నంబర్‌ సిగ్నల్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న దుండగుడు బాలుడిని వంగనూరు క్రాస్‌ రోడ్డు వద్ద వదిలి వెళ్లిపోయాడు. ఒంటరిగా ఏడుస్తున్న చిన్నారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులను తిరుత్తణి డీఎస్పీ గుణశేఖరన్‌ అభినందించారు. బాలుడిని కిడ్నాప్‌ చేసింది అదే గ్రామానికి చెందిన ముబారక్‌ బందువు సులైమాన్‌(30)గా గుర్తించి అరెస్టు చేశారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top