మిస్సింగ్‌ మిస్టరీ.. వ్యభిచార కూపాల్లోకి మహిళలు!

Women Missing Cases Increasing Palnadu District - Sakshi

సాక్షి, పల్నాడు: జిల్లాలో మిస్సింగ్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. అంతు చిక్కని మిస్టరీలుగా మిగిలిపోతున్నాయి. మరోవైపు మానవ అక్రమ రవాణా మాఫియా కోరలు చాచింది. ఫలితంగా అమాయక అబలలు, బాలికలు బలైపోతున్నారు. కొందరు మాయమాటలతో మోసం చేసి మహిళలను రాష్ట్రాలు దాటిస్తున్నారు. వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నారు. కొందరు మృగాళ్లు మాటువేసి మృగవాంఛలు తీర్చుకుంటున్నారు. యువతుల నిస్సహాయతనే ఆసరాగా చేసుకుంటున్నారు. అభంశుభం తెలీని బాలికలనూ కర్కశకులు వదలడం లేదు. ఇటీవల కాలంలో వెలుగుచూసిన పలు కేసులను చూసి పోలీసులే కన్నీరు పెట్టారంటే సమాజం ఎంత దిగజారిపోతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

వెలుగుచూడని గాధలెన్నో  
పరువు కోసమో.. అవమాన భారమో.. ఏమోకానీ పోలీసు మెట్లెక్కని కేసులెన్నో ఉంటాయని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. మహిళ బయటకు వెళ్లి ఇంటికి రాలేదంటే.. అపహాస్యంగా మాట్లాడే వాళ్లే ఎక్కువ. అందుకే చాలా కుటుంబాలు లోలోన కుమిలిపోయి చుట్టపక్కల వెతికి ఊరుకుంటున్నాయి. వారు ఏమైపోయారోనని కూడా ఆరా తీయడం లేదు. ఇలాంటి కేసులు కోకొల్లలు ఉంటాయని తెలుస్తోంది.

పోలీసుల తీరుపైనా విమర్శలు  
మిస్సింగ్‌ కేసుల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. చిన్నారులు, యువతులు, మహిళలు తప్పిపోతే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే బాధిత కుటుంబాలకు వింత పరిణామాలు ఎదురవుతున్నాయి. ఎగతాళిగా మాట్లాడడం బాధిత కుటుంబాలను మరింత కుంగదీస్తోంది. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించకపోవడం, ‘‘బంధువుల, స్నేహితుల నివాసాల్లో అడిగారా..? కొద్ది రోజులు వేచి చూడండి.. అలిగి వెళ్ళి ఉంటారులే..!’’ వంటి సమాధానాలు వస్తుండడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఇలాంటి ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.   

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top