భార్యపై అనుమానం.. గ్రామస్తులతో కలిసి | Woman Forced To Carry Husband And Walk In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

అనుమానం: భర్తను భుజాలపై మోయాలంటూ..

Jul 30 2020 4:06 PM | Updated on Jul 30 2020 5:07 PM

Woman Forced To Carry Husband And Walk In Madhya Pradesh - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధ ఆరోపణలతో గ్రామ పెద్దలు ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. చేసిన తప్పునకు ప్రాయశ్చితంగా భర్తను భుజాలపై ఎత్తుకుని ఊరంతా తిప్పాలని తీర్పునిచ్చారు. ఈ క్రమంలో ఆమెను తీవ్ర పదజాలంతో దూషిస్తూ, కొరడాలు, కర్రలతో కొడుతూ వెంబండించారు. జబువా జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ అకృత్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (ప్రాణం పోయాక వెలుగు చూసిన దారుణం)

వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన భార్యభర్తలు ఉపాధి కోసం గుజరాత్‌కు వెళ్లారు. రోజూవారీ కూలీలుగా పనిచేసేవారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా అక్కడ ఇబ్బందులు తలెత్తడంతో ఆదివారం స్వస్థలానికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఇంటికి చేరుకున్న తర్వాత సదరు భర్త.. తన భార్యకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ముందు అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో ఎలాగైనా ఆమెకు బుద్ధిచెప్పాలని అంతా నిర్ణయించుకున్నారు. తప్పు చేసిందని ఆరోపిస్తూ భర్తను మోసుకుని గ్రామమంతా తిప్పాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇందుకు అంగీకరించిన బాధితురాలు భర్తను మోయలేక ఇబ్బంది పడింది. ( పిండిలో విషం కలిపి..)

అయినప్పటికీ కనికరం చూపకుండా.. కర్రలు, కొరడాతో ఆమెను తరుముతూ, తిట్ల వర్షం కురిపిస్తూ తీవ్రంగా అవమానించారు. వీడియోలు తీస్తూ రాక్షసానందం పొందారు. కాగా ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి భర్తతో పాటు ఏడుగురు గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. కాగా గతంలో కూడా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు అనేకం చేసుకున్నాయి. తనకు నచ్చిన వ్యక్తితో కలిసి పారిపోయిందనే కోపంతో సొంత కుటుంబ సభ్యులే ఓ అమ్మాయిని అర్ధనగ్నంగా మార్చి రోడ్ల వెంట పరిగెత్తించారు. వేరే తెగకు చెందిన వ్యక్తిని ప్రేమించిందనే అక్కసుతో దారుణంగా అవమానించారు. మరో చోట.. వేర్వేరు తెగలకు చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడిన విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు వారిద్దరిని పట్టుకొచ్చి ఊరి మధ్యలో స్తంభాలకు కట్టేసి తీవ్రంగా కొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement