భార్యను హతమార్చి.. ఆత్మహత్యగా

Wife Assassinated By Husband In Medak District - Sakshi

సాక్షి, మెదక్‌: కలకాలం కష్టసుఖాల్లో తోడుంటానని అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను కట్టుకున్నోడే కడతేర్చాడు. మూడు నెలల గర్భిణీ అనే కనికరం లేకుండా చిన్నపాటి కలహాలకే క్షణికావేశానికి గురై గొంతునులిమి హతమార్చి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసాడో కసాయి భర్త. ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాన్ని వదిలేసి కుటుంబంతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబీకులు తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా హవేళిఘణాపూర్‌ మండలం సర్దన గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాదిత కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  

క్షణికావేశంలో.. 
మెదక్‌ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన రాములు–యాదవ్వ దంపతుల కుమార్తె అంజలిని(మహేశ్వరి)(23) హవేళిఘణాపూర్‌ మండలం సర్దన గ్రామానికి చెందిన అభిలాష్‌కు ఇచ్చి 2018 ఏప్రిల్‌లో వివాహం జరిపించారు. ఆ తర్వాత కొంతకాలం సాఫీగా సాగిన సంసారంలో చిన్నపాటి కలహాలు మొదలైనట్లు తెలిపారు. ఏడాది క్రితం అడిగితే బైక్‌ కొనివ్వడంతో పాటు అవసరానికి రూ. 50 వేలు సమకూర్చినట్లు మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. కాగా అదనంగా రూ.లక్ష కట్నం ఇవ్వాల్సింది వేధింపులకు గురిచేయగా గతంలో మూడుసార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిపినట్లు తెలిపారు. ప్రస్తుతం అంజలి మూడు నెలల గర్భిణీ కావడంతో మొదటిసారి తల్లిగారు ఆసుపత్రిలో చూపించాలనే సాంప్రదాయం ప్రకారం రంగంపేట ఆసుపత్రిలో చెకప్‌లు చేయిస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన అంజలిని స్నేహితుడి వివాహం ఉందంటూ భర్త అభిలాష్‌ సోమవారం మధ్యాహ్నం సర్దన గ్రామానికి తీసుకెళ్లినట్లు వివరించారు. కాగా పుస్తెల తాడు కనిపించడం లేదని, కట్నం లక్ష రూపాయలు తీసుకురావాలని సోమవారం రాత్రి ఘర్షణ పడ్డట్లు తెలిపారు. అదే విషయంలో మంగళవారం ఉదయం గొడవపడగా కోపోద్రేక్తుడైన అభిలాష్‌ తన భార్య అంజలిని గొంతునులిమి హతమార్చాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. స్థానికుల సహకారంతో సమాచారం అందుకున్న వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అంజలి మృతి చెందిన విషయాన్ని అత్తమామలకు సమాచారమిచ్చి మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేసి కుటుంబీకులతో కలిసి పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంజలి తల్లిదండ్రులు, కుటుంబీకులు బోరునవిలపించారు. 

కుటుంబీకుల ఆందోళన.. 
ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో మృతదేహంతో ఇంటి ఎదుటే ఆందోళనకు దిగారు. ప్రాణానికి ప్రాణం తీసే వరకు కదిలేదిలేదని సుమారు ఆరు గంటల పాటు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా  బైఠాయించారు. విషయం తెలుసుకున్న రూరల్‌ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి వెళ్ళి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా వర్షంలోనే విధులు నిర్వర్తించారు. ఆవేశంతో ఉన్న ఆందోళనకారులను పోలీసులు ఎంతో చాకచక్యంగా ప్రదర్శించి పరిస్థితిని అదుపుచేశారు. ఈ క్రమంలో మృతురాలి భర్త అభిలాష్‌ తన తల్లి సాయవ్వ, అమ్మమ్మ నర్సమ్మ, చెల్లెలు సోనితో కలిసి హవేళిఘణాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిపారు. చిన్నపాటి ఘర్షణతో క్షణికావేశంలో తన భార్య అంజలి గొంతునులిమి హతమార్చినట్లు నిందితుడు అభిలాష్‌ అంగీకరించినట్లు తెలిపారు. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని మెదక్‌ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top