ఏపీ: అక్రమ తవ్వకాలపై విజిలెన్స్‌ కొరడా

Vigilance Inspection At 15 Quarries In Anakapalle Area - Sakshi

నవయుగ, మధుకాన్, వాణి గ్రానైట్స్‌ కంపెనీల అడ్డగోలు తవ్వకాలు

10 క్వారీల్లో నవయుగ ఉల్లంఘనలు, 3 క్వారీల్లో మధుకాన్‌ అరాచకాలు

అనకాపల్లి ప్రాంతంలో 15 క్వారీల్లో విజిలెన్స్‌ తనిఖీలు

నిబంధనలకు విరుద్ధంగా భారీగా తవ్వకాలు జరిగినట్లు నిర్ధారణ 

సాక్షి, అమరావతి: అనకాపల్లి ప్రాంతంలో బడా కంపెనీలు ఇష్టారాజ్యంగా చేస్తున్న అక్రమ తవ్వకాలపై మైనింగ్‌ విజిలెన్స్‌ విభాగం విరుచుకుపడింది. రాష్ట్రంలోని అన్ని విజిలెన్స్‌ బృందాలు అక్కడకు చేరుకుని మూడురోజులుగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ తనిఖీల్లో నవయుగ కన్‌స్ట్రక్షన్స్, మధుకాన్, వాణి గ్రానైట్స్‌ కంపెనీల అరాచకాలు బయటపడ్డాయి. ప్రస్తుతం 15 రోడ్‌ మెటల్‌ క్వారీల్లో తనిఖీలు జరుగుతున్నాయి. అందులో 10 నవయుగ కంపెనీవే. అనకాపల్లి మండలం ఊడేరు సర్వే నంబరు 211లో నవయుగ కంపెనీకి 10 క్వారీలున్నాయి. వీటికి సంబంధించి 35 హెక్టార్లలో తవ్వకాలు జరుపుతున్నారు. 2 జెయింట్‌ క్రషర్స్‌తో నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు తవ్వుతున్నారని అధికారులు గుర్తించారు. ఎన్ని క్యూబిక్‌ మీటర్ల రోడ్‌ మెటల్‌ తవ్వకానికి రాయల్టీ కట్టారు, ఎన్ని క్యూబిక్‌ మీటర్లు తవ్వారో లెక్కిస్తున్నారు. రాయల్టీ కట్టిన దానికంటె ఎక్కువగా పెద్దస్థాయిలో తవ్వినట్లు తేలింది.

ఈ క్వారీల్లో ఇంకా అనేక ఉల్లంఘనలను నిర్ధారించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్‌ కంపెనీకి అనకాపల్లి మండలం మార్టూరులో సర్వే నంబర్‌ 1లో ఉన్న 3 క్వారీల్లో అక్రమాలు గుర్తించారు. ఈ క్వారీల్లో 50 అడుగుల లోతువరకు నీళ్లు ఉండడంతో ఎంత మెటల్‌ తవ్వారో కొలవడం ఇబ్బందికరంగా మారింది. అనుమతి లేకుండా చాలాలోతు నుంచి పేలుళ్లు జరిపి తవ్వకాలు జరపడంతో భారీగోతులు ఏర్పడ్డాయి. ఇలాంటిచోట ఎంత మెటల్‌ తవ్వారో లెక్కించడానికి బ్యాటరీ మెట్రిక్‌ పరికరాన్ని తెప్పిస్తున్నారు. సాధారణంగా ఎలక్ట్రానిక్‌ ప్రాసెస్‌ స్టేషన్‌ (ఈపీఎస్‌) పరికరంతో తవ్వకాలను కొలుస్తారు.

డీజీపీఎస్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు. కానీ మధుకాన్‌ క్వారీల్లో వాటితో కొలతలు వేయడానికి వీల్లేని స్థాయిలో తవ్వకాలు జరపడంతో సముద్రంలో ఇసుక డ్రెడ్జింగ్‌ సమయంలో ఉపయోగించే బ్యాటరీ మెట్రిక్‌ పరికరాన్ని తెప్పిస్తున్నారు. అనకాపల్లి మండలం మామిడిపాలెం సర్వే నంబరు 109లో వాణి గ్రానైట్స్‌ తనకున్న రెండు క్వారీల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ 15 క్వారీల్లో డ్రోన్‌ సర్వే కూడా చేయనున్నారు. మొత్తం 25 క్వారీలపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. మొదట ఈ 15 క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. 2, 3 రోజుల్లో వీటిలో తనిఖీలు పూర్తిచేసి అక్రమాలను రికార్డు చేసి జరిమానా విధించనున్నారు. ఉల్లంఘనలు మరీ శృతిమించితే అనుమతుల రద్దుకు సిఫారసు చేసే అవకాశం ఉంది.

రాజకీయ ఒత్తిళ్లు.. అధికారుల సహాయ నిరాకరణ 
వైఎస్సార్‌ కడప–చిత్తూరు, కర్నూలు–అనంతపురం, ప్రకాశం–నెల్లూరు–గుంటూరు, కృష్ణా–తూర్పు–పశ్చిమగోదావరి,విశాఖ–విజయనగరం–శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మైనింగ్‌ విజిలెన్స్‌ బృందాలు ఈ తనిఖీలు చేస్తున్నాయి. తనిఖీల్లో పెద్దఎత్తున ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని వాటికి నేతృత్వం వహించిన మైనింగ్‌ విజిలెన్స్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. వారం, పదిరోజులు తనిఖీలు కొనసాగుతాయన్నారు. తనిఖీలు ఆపేందుకు ఆయా కంపెనీలు స్థానిక రాజకీయ నాయకుల నుంచి విజిలెన్స్‌ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. స్థానిక మైనింగ్‌ అధికారులు విజిలెన్స్‌ బృందాలకు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు సమాచారం. ఫైళ్లు ఇవ్వకపోవడంతోపాటు విజిలెన్స్‌ బృందాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయా కంపెనీల ప్రతినిధులకు చెబుతున్నట్లు తెలిసింది.

అక్రమార్కులను వదలం
గనుల్లో అక్రమ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. నిబంధనల ప్రకారమే తవ్వకాలు జరపాలి. ఉల్లంఘించినవారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. ఉత్తరాంధ్రలో మైనింగ్‌ తవ్వకాలు చాలాచోట్ల ఇష్టారీతిన జరుగుతున్నాయి. విజిలెన్స్‌ బృందాల తనిఖీల్లో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. అక్రమార్కులు అందరినీ బయటకులాగి చర్యలు తీసుకుంటాం.
– వి.జి.వెంకటరెడ్డి, మైనింగ్‌ డైరెక్టర్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top