ప్రాణాలు తీసిన అతివేగం 

Three People Died In Road Accident At Pragnapur Siddipet District - Sakshi

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

ముగ్గురి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ వద్ద ఘటన  

గజ్వేల్‌ రూరల్‌: రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ ఆర్టీసీ డిపో సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా తాండూరు గ్రామ సర్పంచ్‌ అంజిబాబుకు చెందిన కారు హైదరాబాద్‌లో ఉండటంతో దానిని తీసుకొచ్చేందుకు, అదే గ్రామానికి చెందిన సాయిప్రసాద్, భానుప్రసాద్‌తో కలసి గణేష్‌కు చెందిన నిస్సాన్‌ మిక్రా (టీఎస్‌20 0006) కారులో బుధవారం రాత్రి బయలుదేరారు. గణేష్‌ డ్రైవింగ్‌ చేస్తుండగా.. అతని పక్కన సర్పంచ్‌ అంజిబాబు, వెనుక సీట్లో సాయిప్రసాద్, భానుప్రసాద్‌ కూర్చున్నారు.

ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు గురువారం తెల్లవారుజామున ప్రజ్ఞాపూర్‌ ఆర్టీసీ బస్‌డిపో సమీపంలో రాజీవ్‌ రహదారిపై నిలిపి ఉన్న సిమెంట్‌ లారీని వెనుక భాగంలో ఢీకొనడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో సర్పంచ్‌ అంజిబాబు, డ్రైవర్‌ గణేష్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలైన సాయిప్రసాద్‌ను 108లో గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు తెలిపారు. భానుప్రసాద్‌కు సైతం ఛాతిపై, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. గజ్వేల్‌ సీఐ ఆంజనేయులు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.  

రాత్రివేళ రోడ్డుపై వాహనాలు ఆపొద్దు: సీపీ
ప్రమాద స్థలిని గురువారం సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయెల్‌ డేవిస్, గజ్వేల్‌ ఏసీపీ నారాయణ, సీఐ ఆంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ జోయెల్‌ డేవిస్‌ మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో లారీలను రోడ్డుపై నిలపకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top