సెల్ఫీ తీసుకుంటూ కాలువలో పడ్డ యువకుడు, రక్షించబోయిన ముగ్గురు మృతి

Three Deceased Washed Away In Telugu Ganga Canal Chittoor - Sakshi

స్నేహితుడిని కాపాడబోయి ముగ్గురి మృత్యువాత

సాక్షి, వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): సరదా కోసం తీసుకున్న సెల్ఫీ మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి తెలుగుగంగ కాలువలో పడిన స్నేహితుడిని కాపాడేందుకు అందులోకి దిగిన ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం సమీపంలోని ఉబ్బలమడుగు వద్ద చోటు చేసుకుంది.

ఎస్‌ఐ పురుషోత్తమ్‌రెడ్డి కథనం మేరకు.. ఈ నెల 6న చెన్నైకి చెందిన నూతన దంపతులు ప్రియ, లోకేష్‌ ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రానికి బయలుదేరారు. మార్గంమధ్యలో గుమ్మిడిపూండి వద్ద తన స్నేహితులైన కార్తీక్, బాలాజీ, యువరాజును కూడా వెంట తీసుకెళ్లారు. కోవిడ్‌ నిబంధనలతో ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రాన్ని మూసివేయడంతో పక్కనే ఉన్న తెలుగుగంగ ప్రధాన కాలువ వద్ద కాసేపు సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఇంతలో యువరాజు సెల్ఫీ తీసుకుంటూ కాలువలోకి జారిపడ్డాడు. దీన్ని గమనించిన స్నేహితులు లోకేష్‌ (23), కార్తీక్‌ (17), బాలాజీ (24) కాలువలోకి దూకి యువరాజును కాపాడబోయారు. అయితే ప్రవాహ తాకిడికి ముగ్గురు యువకులు నీటిలో మునిగి కొట్టుకుపోయారు.

యువరాజు మాత్రం నీటిప్రవాహాన్ని ఎదురొడ్డి గట్టుకు చేరాడు. యువరాజు, ప్రియ కలిసి కాలువ వెంట కొంతదూరం వరకు యువకుల ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం దక్కలేదు. ముగ్గురు యువకులు ఎలాగైనా బయటపడి తిరిగొస్తారని వేచిచూసిన ప్రియ, యువరాజు ఫలితం లేకపోవడంతో గురువారం రాత్రి వరదయ్యపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టగా సత్యవేడు మండలం రాచపాళెం సమీపంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని లోకేష్, బాలాజీలుగా గుర్తించారు. కార్తీక్‌ మృతదేహం కోసం తమిళనాడు పూండి కాలువ వరకు గాలింపు చర్యలు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top