‘డీపీఓ’లో దొంగలు పడ్డారు! 

Thefts At The Anantapur District Police Office - Sakshi

15 రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీ

దర్గాలో హుండీలను పగలగొట్టి నగదు అపహరణ 

టూ టౌన్‌ స్టేషన్‌లో మత పెద్దల ఫిర్యాదు 

జిల్లా పోలీసు కార్యాలయం.. నిరంతర పహారా ఉండే ప్రాంతం. డీఐజీ, ఎస్పీ కార్యాలయాలతో పాటు ఎందరో పోలీసు కుటుంబాలుంటాయి. ప్రవేశమార్గంలోనే నిత్యం పోలీసు నిఘా ఉంటుంది. అలాంటి డీపీఓనే దొంగలు టార్గెట్‌ చేశారు. 15 రోజుల వ్యవధిలోనే రెండుసార్లు చేతివాటం చూపారు. డీపీఓలోని దర్గాలోని హుండీలను కొల్లగొట్టి పోలీసులకే సవాల్‌ విసిరారు.  

అనంతపురం క్రైం: నిరంతరం కట్టుదిట్టమైన పోలీస్‌ పహారా ఉన్న జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఉన్న దస్తగిరి స్వామి జెండా కట్ట(దర్గా)లో వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. సాక్షాత్తు ఎస్పీ, ఉన్నతాధికారులు, వేల సంఖ్యలో పోలీసులు సంచరించే ఈ ప్రాంతంలోనే 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు చోరీలు జరగడం గమనార్హం. దర్గా పెద్దల ఫిర్యాదుతో టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  

రెండు హుండీలు ఖాళీ.. 
లాక్‌డౌన్‌కు ముందు డీపీఓలోని దర్గాకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుని వెళ్లేవారు. గురు, శుక్రవారాల్లో 1,500 మందికిపైగా భక్తులు వస్తుంటారు. ఈ రెండు రోజుల వ్యవధిలోనే రూ.వేలల్లో స్వామికి ముడుపులు అందుతుంటాయి. కరోనా లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి దర్గాను పూర్తిగా మూసివేశారు. దీనిని ఆసరాగా తీసుకున్న ఓ వ్యక్తి పదిహేను రోజుల క్రితం ఓ హుండీని పగులగొట్టి అందులోని డబ్బు తీసుకెళ్లాడు. ఈ విషయం మరువక ముందే రెండు రోజుల క్రితం మళ్లీ అదే వ్యక్తి దర్గాలోకి చొరబడి మరో హుండీని పగులగొట్టి అందులోని డబ్బు తీసుకెళ్లాడు.

చోరీలు జరిగిన దస్తగిరి స్వామి జెండా కట్ట(దర్గా) ఇదే..   

రంగంలోకి ‘టూ టౌన్‌’.. 
దర్గాలో చోటు చేసుకున్న వరుస చోరీలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. చుట్టూ పోలీసుల రక్షణ వలయంలో ఉన్న జిల్లా పోలీసు కార్యాలయంలోనే ఈ పరిస్థితి తలెత్తడంతో రక్షణ వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం చోటు చేసుకునే ప్రమాదం నెలకొంది. దీంతో దర్గా పెద్దల ఫిర్యాదుతో అనంతపురం టూ టౌన్‌ పోలీసులు రంగంలో దిగారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసు దర్యాప్తును వారు స్వీకరించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించారు. డీపీఓకు ఓ చివర దర్గా ఉంది. లాక్‌డౌన్‌ నుంచి దర్గా మూసి వేయడంతో అటువైపు ఎవరూ వెళ్లే పరిస్థితి లేదు. దీనిని ఆసరాగా తీసుకున్న దొంగ దర్గా వెనుకవైపు గుల్జార్‌పేట నుంచి వచ్చాడా...? లేక తరచూ డీపీఓ, పోలీసు పెరేడ్‌ గ్రౌండ్స్‌కు వస్తూ ఇలా దొంగతనాలకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, రెండు హుండీల్లో పెద్ద మొత్తంలోనే డబ్బు తీసుకెళ్లినట్లు పలువురు పేర్కొంటున్నారు. అయితే కేసు నమోదులో పోలీసులు కేవలం రూ.5 వేలు మాత్రమే నమోదు చేయడం గమనార్హం.  

నిఘా కరువై.... 
డీపీఓలో పోలీసుల పహారా నిరంతరం ఉంటుంది. వారిని దాటుకునే ఎవరైనా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇంత కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఓ చివరన ఉన్న దర్గాలోకి దొంగ చొరబడి దర్జాగా హుండీలోని సొమ్ము అపహరించుకెళ్లడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మొదటి సారి చోరీ జరిగినప్పుడే పోలీసులు అప్రమత్తమై ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదంటూ పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top