మచిలీపట్నం జైలుకు పట్టాభి 

TDP Leader Pattabhi to Machilipatnam Jail - Sakshi

విజయవాడ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. వచ్చేనెల 2 వరకు రిమాండ్‌ 

5 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్‌ 

విజయవాడ లీగల్‌/లబ్బీపేట(విజయవాడతూర్పు)/తోట్లవల్లూరు: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని గురువారం విజయవాడ గవర్నర్‌పేట పోలీసులు నగరంలోని మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. విచారించిన న్యాయాధికారి ఏపీపీ వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి నవంబర్‌ 2వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. దీంతో పట్టాభిని మచిలీపట్నం సబ్‌ జైలుకు తరలించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని సూర్యారావుపేట పోలీసులు బుధవారం రాత్రి విజయవాడలో అరెస్టు చేసి తోట్లవల్లూరు పోలీసు స్టేషన్లో ఉంచిన విషయం తెలిసిందే. ఆయన్ని గురువారం ఉదయం తోట్లవల్లూరు పోలీసు స్టేషన్‌ నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శిరీష వైద్య పరీక్షలు నిర్వహించి పట్టాభి ఆర్యోగం ఫిట్‌గా ఉందని నిర్ధారించారు. అనంతరం ఆయన్ని సివిల్‌ కోర్టుల ప్రాంగణంలోని మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరిచారు. నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ స్టేషన్‌ బెయిలు ఇవ్వకుండా పోలీసులు కావాలని రిమాండ్‌ పెట్టారని చెప్పారు.

ఏపీపీ తన వాదనలు వినిపిస్తూ నిందితుడు గతంలో కూడా ఇలాగే మాట్లాడారని, పలు కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయాధికారి నిందితుడికి రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు అతడిని మచిలీపట్నం జైలుకు తరలించారు. ఈ కేసులో పట్టాభిని విచారించి సమాచారం రాబట్టేందుకు తమకు ఐదురోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గవర్నర్‌పేట పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. పట్టాభికి బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అతడి న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు.  

తోట్లవల్లూరులో రోడ్డుపై బైఠాయింపు 
పట్టాభిని విడుదల చేయాలంటూ టీడీపీ నాయకులు తోట్లవల్లూరులో గురువారం హైడ్రామా సృష్టించారు. పట్టాభిని బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న టీడీపీ మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర వచ్చి ఆయన్ని కలుసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగారు.

గురువారం ఉదయం  గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ మాజీ డైరెక్టర్‌ వీరంకి వెంకటగురుమూర్తి, నాయకులు చింతా రాజా, కళ్లం వంశీకృష్ణారెడ్డి, నెక్కలపూడి మురళి తదితరులు పట్టాభిని విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు. పోలీస్‌స్టేషన్‌ రోడ్‌లో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తీవ్ర ఉత్కంఠ నడుమ తూర్పు ఏసీపీ కె.విజయపాల్, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో పోలీసులు ఉదయం 11.15 గంటల సమయంలో పట్టాభిని ప్రత్యేక వాహనంలో విజయవాడ తరలించారు. ఉయ్యూరు సీఐ ముక్తేశ్వరరావు, ఎస్‌ఐ అర్జున్‌ బందోబస్తును పర్యవేక్షించారు.  

పట్టాభిపై పాతపట్నం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు 
పాతపట్నం: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మత్స్యకారుల జీవన విధానాన్ని కించపరుస్తూ మీడియాలో మాట్లాడారని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీసుస్టేషన్‌లో తెంబూరు సర్పంచ్‌ బెనియా వెంకటరమణ, మత్స్యకార కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బెనియా విజయలక్ష్మి గురువారం ఫిర్యాదు చేశారు. పిత్తపరిగిలు ఏరుకునే వాళ్లు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, మత్స్యకారుల ఆత్మగౌరవాన్ని కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. పట్టాభిపై ఫిర్యాదు అందినట్లు ఏఎస్‌ఐ టి.శ్రీనివాసరావు తెలిపారు.  

అత్యుత్సాహం చూపిన నేతలు, కొందరు న్యాయవాదులు 
కోర్టులో టీడీపీ నేతలతోపాటు కొందరు న్యాయవాదులు చంద్రబాబు మెప్పు కోసం అత్యుత్సాహం చూపించారు. ఒక న్యాయవాది ఓ అడుగు ముందుకు వేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కూడా ఘాటుగానే స్పందించడంతో కిమ్మనకుండా వెళ్లిపోయారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడటం చాలా బాధాకరమని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఇదే మాట చంద్రబాబును అంటే ఎంత బాధగా ఉంటుందో మాట్లాడేవారు ఆలోచించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, చెన్నుపాటి ఉషారాణి, గాంధీ తదితరులు పట్టాభికి సంఘీభావంగా కోర్టుకు వచ్చారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top