టీడీపీ నేత దాష్టీకం 

TDP Leader Over Action On Women And Child house arrest - Sakshi

తల్లీ, బిడ్డల గృహనిర్బంధం 

పోలీస్‌ కంట్రోల్‌ రూంను ఆశ్రయించిన బాధితులు 

ఏడేళ్ల బిడ్డతో పాటు మహిళను విడిపించిన పోలీసులు  

కుప్పం: చీటీ డబ్బులు సకాలంలో చెల్లించలేదనే కారణంతో ఏడేళ్ల బిడ్డతో సహా తల్లిని గృహనిర్బంధం చేసిన ఓ టీడీపీనేత నిర్వాకం వెలుగుచూసింది. శాంతిపురం మండలంలోని ఎం.కె.పురం పంచాయతీ కృష్ణాపురంలో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాపురానికి చెందిన టీడీపీ బూత్‌ కమిటీ నాయకుడు ప్రకాష్‌ గ్రామంలో చీటీలు నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన పాండురంగ ఇతని వద్ద చీటీ వేసి పాడుకున్నాడు.

ఇందుకు సంబంధించిన డబ్బులు సకాలంలో ఇవ్వలేదని  మంగళవారం రాత్రి పాండురంగ ఇంటి వద్దకు వెళ్లిన ప్రకాష్‌ గొడవకు దిగాడు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న పాండురంగ గుడిలో ఉన్నాడని భార్య భవాని (26) చెప్పినా వినిపించుకోకుండా వీధిలో నిలబడి నానా బూతులు తిట్టాడు. భవాని, తన కూతురు చిద్విలాసిని (7) వెంటనే ఇల్లు విడిచిపోవాలని హుకుం జారీ చేశాడు.

ఎలాగోలా అప్పు తీర్చేస్తామని ఆమె వేడుకున్నా కనికరించకుండా తల్లీబిడ్డలు ఇంట్లో ఉండగానే ఇంటి బయట తాళం వేసుకుని వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో బాధితులు పోలీస్‌ కంట్రోల్‌ రూంకు సమాచారం ఇచ్చారు. రాళ్లబూదుగూరు పోలీసులు తాళాలు తెరిపించి తల్లీబిడ్డలకు గృహనిర్బంధం నుంచి విముక్తి కలిగించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ మునిస్వామి తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top