హతవిధీ..! మూడు రోజులు కూడా కాకుండానే..

Tamil Nadu: Newborn, Parents Among Four Dead At Road Accident - Sakshi

బిడ్డపుట్టిందనే ఆనందం ఆ దంపతులకు ముచ్చటగా మూడు రోజులైనా మిగల్లేదు. ఆస్పత్రిని నుంచి తల్లీబిడ్డను ఆటోలో ఇంటికి తీసుకొస్తుండగా మృత్యువు వారిని కారు రూపంలో వెంటాడింది. ఫలితంగా నవజాత శిశువు సహా తల్లిదండ్రులు, ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించారు. ఈ తీవ్ర విషాద ఘటన రామేశ్వరం హైవేపై చోటు చేసుకుంది. 

​అన్నానగర్‌: శిశువును ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొస్తున్న సమయంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో దంపతులు సహా మొత్తం నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాలు.. రామనాథపురం జిల్లా వేదాలై గ్రామం సింగివేలైకుప్పానికి చెందిన చిన్న అడైక్కాన్‌ (28) టీ దుకాణంలో కూలీగా పని చేస్తున్నాడు. ఇతని భార్య సుమతి (25). నిండు గర్భిణి అయినా ఈమెను ప్రసవం కోసం ఆమెను రామనాథపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్పించారు. ఈనెల 17వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం సాయంత్రం సుమతి, చిన్నారిని మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

చిన్న అడైక్కాన్, అతని భార్య సుమతి, పుట్టిన శిశువు, బంధువు సింఘివాలైకుప్పానికి చెందిన కాళియమ్మాళ్‌ (50) ఆటోలో రామనాథపురం నుంచి వేదాలైకి బయలుదేరారు. రామనాథపురం విత్తనూరుకు చెందిన మలైరాజ్‌ (50) ఆటోను నడుపుతున్నాడు. రామేశ్వరం జాతీయ రహదారిపై నదిపాలెం సమీపంలో ఆటో వస్తుండగా.. ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ఆటోలో ఉన్నవారు ఎగిరి బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది.

ప్రమాదం గురించి తెలుసుకున్న కారులో బాడుగకు వచ్చిన వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇక కారు ఢీకొనడంతో చిన్న అడైకాన్, అతని భార్య సుమతి, అప్పుడే పుట్టిన మగబిడ్డ, ఆటో డ్రైవర్‌ మలైరాజ్‌ నలుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. రక్తపుమడుగులో తీవ్రగాయాలై ప్రాణాలతో పోరాడుతున్న కాళియమ్మాళ్‌ను స్థానికులు రామనాథపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉచిపులి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నలుగురి మృతదేహాలను పోస్టుమారా్టనికి తరలించారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ విఘ్నేష్‌ను ఉచిపులి పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.

చదవండి కేడీ పోలీస్‌.. గుట్టుగా వ్యభిచారం! మహిళా ఎస్‌ఐ కుటుంబసభ్యులే అలా..!

   

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top