తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ టోకరా

Robbery In The Name Of gold at low price - Sakshi

సినీ ఫక్కీలో రూ.32 లక్షలు గుంజుకొని పరారైన గ్యాంగ్‌ 

గుంటూరు జిల్లాలో ఘటన

బాపట్ల: తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మబలికి.. సినీ ఫక్కీలో రూ.32 లక్షల సొమ్ము గుంజుకొని పారిపోయారు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురం శివారులో జరిగింది. వివరాలు.. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌కు చెందిన అమరనాథ్‌రెడ్డి, ఆంజనేయులు బంగారం వ్యాపారం చేస్తుంటారు. బాపట్లలో తక్కువ ధరకు బంగారం వస్తుందని తెలుసుకున్న ఆంజనేయులు.. తనకున్న పరిచయాలతో స్టువర్టుపురానికి చెందిన గురవయ్య అలియాస్‌ చిట్టిబాబును ఫోన్‌లో సంప్రదించాడు.

చిట్టిబాబు తన బంధువైన ఉత్తమ్‌కు ఈ విషయం తెలియజేశాడు. ఇద్దరూ కలిసి ప్లాన్‌ చేసి రూ.45 లక్షల విలువైన బంగారాన్ని రూ.32 లక్షలకు ఇస్తామని నమ్మబలికారు. దీంతో అమరనాథ్‌రెడ్డి, ఆంజనేయులు చీరాలకు వచ్చి ఓ లాడ్జిలో బస చేశారు. ఉత్తమ్‌కుమార్, చిట్టిబాబు వారి వద్దకు వచ్చి రూ.32 లక్షలు ఉన్నాయని నిర్ధారణ చేసుకున్నాక బేతపూడికి రావాలని చెప్పి వెళ్లిపోయారు.

అమరనాథ్‌రెడ్డి, ఆంజనేయులు అక్కడకు చేరుకోగా బంగారం ఇవ్వకుండానే రూ.32 లక్షలను ఉత్తమ్, చిట్టిబాబు లాక్కున్నారు. ఇంతలో కొందరు అక్కడకు చేరుకొని.. తాము పోలీసులమంటూ భయపెట్టి అమరనాథ్‌రెడ్డిని, ఆంజనేయులను అక్కడ్నుంచి పంపించేశారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న వారిద్దరూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top