రూ.12.5 కోట్ల విలువైన ఎర్ర చందనం స్వాధీనం

Red sandalwood worth above Rs 12 crore seized - Sakshi

తమిళనాడులో చిత్తూరు పోలీసుల ‘ఆపరేషన్‌ రెడ్‌’

రూ.10 కోట్ల విలువైన దుంగలు స్వాధీనం.. ఏడుగురి అరెస్ట్‌ 

టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో మరో రూ.2.5 కోట్ల దుంగలు గుర్తింపు

స్మగ్లర్లు, కూలీలు తమిళనాడుకు చెందినవారే..

చిత్తూరు అర్బన్‌/తిరుపతి అర్బన్‌: చిత్తూరు జిల్లా పోలీసులు భారీ ఎత్తున రూ.12.5 కోట్ల విలువైన ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల పాటు తమిళనాడులో నిర్వహించిన ‘ఆపరేషన్‌ రెడ్‌’లో భాగంగా రూ.10 కోట్ల విలువైన దుంగలను స్వాధీనం చేసుకోగా, సదాశివకోన ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ బృందం రెండు రోజులుగా కూంబింగ్‌ నిర్వహించి రూ.2.5 కోట్లు విలువ చేసే దుంగలను స్వాధీనం చేసుకుంది. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం చెట్లను నరికి తమిళనాడుకు.. అటు నుంచి విదేశాలకు తరలించేందుకు యత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు వివరాలను గురువారం చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్, టాస్క్‌పోర్స్‌ డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వెల్లడించారు.

గుడిపాల వద్ద  బుధవారం వాహనాలు తనిఖీచేస్తున్న పోలీసులు.. ఓ వాహనంలో ఆరు ఎర్రచందనం దుంగలను గుర్తించి సీజ్‌ చేశారు. చిత్తూరుకు చెందిన పి.నాగరాజు, తమిళనాడుకు చెందిన ఎ.రామరాజు, జి.ప్రభు, ఎస్‌.విజయ్‌కుమార్, ఎ.సంపత్, కె.అప్పాసామి, కె.దొరరాజ్‌లను అరెస్ట్‌ చేశారు. వీరిచ్చిన సమాచారంతో తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబత్తూరులో ఆపరేషన్‌ రెడ్‌ నిర్వహించారు. వలర్‌పురం వద్ద ఓ గోదాములో దాచిన రూ.10 కోట్లు విలువ చేసే 353 ఎర్రచందనం దుంగలను, వాహనాలను సీజ్‌ చేశారు. కేసులో మరికొందర్ని అరెస్ట్‌ చేయాల్సి ఉందని ఎస్పీ చెప్పారు. ఇదిలా ఉండగా వడమాలపేట, ఏర్పేడు మండలాల్లో విస్తరించి ఉన్న సదాశివకోన ప్రాంతంలో రెండు రోజులుగా కూంబింగ్‌ నిర్వహించి 8 చోట్ల రూ.2.5 కోట్లు విలువ చేసే 5 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. స్మగ్లర్లు, కూలీలు తమిళనాడుకు చెందినవారని, త్వరలోనే పట్టుకుంటామన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top