శ్రీకాంత్‌రెడ్డి హత్య: వివాహేతర సంబంధమే కారణం

Police Says Alwal Srinivas Reddy Assassination Over Extramarital Affairs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అల్వాల్ శ్రీకాంత్‌రెడ్డి హత్య కేసును రాచకొండ పోలీసులు చేధించి పలు కీలక విషయాలను వెల్లడించారు. అతని హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. శ్రీకాంత్‌రెడ్డిని కిడ్నాప్ చేసి జవహర్‌నగర్‌ని ఒక ఇంట్లో బంధించి వారం రోజులు చిత్ర హింసలకు గురిచేసి దారుణంగా నిందితుడు కనకరాజు హత్య చేసినట్లు తెలిపారు. ఈ దారుణ హత్య ఘటన ఐదు రోజుల క్రితం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు హస్మత్‌పేట్‌లోని శ్మాశాన వాటికలో శ్రీకాంత్‌రెడ్డిని పూడ్చి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో నిందితుడు కనకరాజు హత్యకు సంబంధించిన విషయాన్ని తన స్నేహాతులకు చేప్పడంతో పోలీసులకు తెలిసింది. దీంతో కనకరాజుతో పాటు మరో నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు తెలిపారు. వివరాలు.. హస్మత్‌పేట్‌లో నివసించే కనకరాజు(45) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో పాటుగా రాజకీయ నాయకుడిగా కూడా చెలామణి అవుతున్నాడు. స్థానికంగా పంచాయతీలు కూడా చేస్తాడు. ఈ క్రమంలో  15 సంవత్సరాల క్రితం ఓ మహిళ కుటుంబంలో గొడవలు రావడంతో ఆమెకు విడాకులు వచ్చేలా చేశాడు.

అనంతరం ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అప్పటినుంచీ ఈ అక్రమ వ్యవహారం సాగుతోంది. అల్వాల్‌లోని మచ్చబొల్లారం చంద్రానగర్‌లో ఆమె నివాసముంటోంది. ఆ ప్రాంతంలో కుత్బుల్లాపుర్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డి(36) అనే  ఆటో డ్రైవర్‌ నివాసం ఉంటున్నాడు. ఎదురెదురుగా ఇల్లు కావడంతో శ్రీకాంత్‌రెడ్డికి మహిళతో పరిచయమై అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరువాత ఈ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు ఎక్కడున్నారో కనుక్కొని తిరిగి పిలిపించి నచ్చెప్పాడు కనకరాజు. వారు వినిపించుకోకపోవడంతో  40 రోజుల  క్రితం శ్రీకాంత్‌రెడ్డిని  జవహర్‌నగర్‌లోని ఓ ఇంటిలో బందించాడు. కనకరాజు అతని స్నేహితులు మరో ముగ్గురు బాధితుడిని చిత్ర హింసలకు గురి చేశారు. ఈ నెల 6న తాడును గొంతుకు బిగించి శ్రీకాంత్‌రెడ్డిని హతమార్చారు. శవాన్ని హస్మత్‌పేట్‌లోని శ్మాశాన వాటికకు తీసుకువచ్చి గుర్తుతెలియని శవంగా చెప్పి పూడ్చి వేశారు.  మృతుడి సోదరుడు అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top