అమరావతి భూ అక్రమాల కేసులో ముగిసిన పోలీస్‌ కస్టడీ

Police custody ended in Amaravati land irregularities case - Sakshi

నిందితులు సుధీర్‌బాబు, సురేష్‌లను విచారించిన పోలీసులు

2 రోజుల కస్టడీలో 7 గంటల పాటు కొనసాగిన విచారణ  

సాక్షి, గుంటూరు: రాజధాని అమరావతి భూ అక్రమాల కేసులో నిందితుల రెండు రోజుల పోలీస్‌ కస్టడీ శనివారంతో ముగిసింది. అమరావతి గ్రామాల పరిధిలో భూముల రికార్డులను తారుమారు చేసిన కేసులో గుంటూరు జిల్లా తుళ్లూరు మండల మాజీ తహసీల్దార్‌ అన్నే సుధీర్‌ బాబు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, విజయవాడ ఎం అండ్‌ ఎం వస్త్రదుకాణ యజమాని గుమ్మడి సురేష్‌లను అరెస్టు చేసిన పోలీసులు రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు.

చివరిరోజు శనివారం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విచారణ కొనసాగింది. రెండు రోజుల కస్టడీలో ఏడు గంటల పాటు నిందితులను పోలీసులు విచారించారు. ఉదయం 10 గంటలకు జిల్లా జైలుకు చేరుకున్న తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి న్యాయవాది సమక్షంలో సురేష్‌ను విచారించారు. ఆయన ఏ విధంగా అసైన్డ్‌ భూమిని కొనుగోలు చేశాడు..? అప్పటి తహసీల్దార్‌ అన్నే సుధీర్‌ బాబు సహాయంతో అసైన్డ్‌ భూమిని పట్టా భూమిగా ఏ విధంగా వెబ్‌ ల్యాండ్‌లోకి ఎక్కించారు..? ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది.   

పరస్పర ఒప్పందంతోనే.. 
సుధీర్‌ బాబు, సురేష్‌లు ఇద్దరూ పరస్పర ఒప్పందంతోనే అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగానే సురేష్‌ భూమిని కొనుగోలు చేసి సీఆర్‌డీఏకు రికార్డులు సమర్పించే రెండు నెలలకాలం భూమిని పట్టా భూమిగా చూపారని, అనంతరం అసైన్డ్‌ భూమిగా వెబ్‌ ల్యాండ్‌లో మార్పు చేసినట్టు సమాచారం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top