గ్రీజు డబ్బా.. గిఫ్ట్‌ ప్యాక్‌! ‘పుష్ఫ’ స్టైల్‌లో హష్‌ ఆయిల్‌ రవాణా  | Sakshi
Sakshi News home page

సినీ ఫక్కీలో పక్కా ప్లాన్‌.. గ్రీజు డబ్బాలో హష్ ఆయిల్‌ స్మగ్లింగ్‌.. ముఠా గుట్టు రట్టు

Published Fri, Jul 15 2022 1:23 PM

Police Arrested Hash Oil Smugglers Gang In Hyderabad - Sakshi

సాక్షి, నాగోలు: గంజాయి ప్రాసెసింగ్‌ ద్వారా తయారు చేసే హష్‌ ఆయిల్‌ స్మగ్లింగ్‌లో ఓ ముఠా ‘పుష్ఫ’ పంథాను అనుసరించింది. గ్రీజు డబ్బాతో పాటు గిఫ్ట్‌ ప్యాక్‌ రూపంలోనూ నాలుగు లీటర్లు తీసుకువస్తుండగా సమాచారం అందుకున్న ఎల్బీనగర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్వోటీ) పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు.

గురువారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్, డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్, మురళీధర్, ఏసీపీలు వెంకన్న నాయక్, పురుషోత్తం రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు.

 
రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్

లీటర్‌ హష్‌ ఆయిల్‌ రూ.4 లక్షలు.. 
ఏపీలోని విశాఖపట్నం జిల్లా జంపెన గ్రామానికి చెందిన కోనశివ (24) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వంట పని కార్మికుడు నూకరాజుతో (25) ఇతడికి స్నేహం ఉంది. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన సంతోష్‌కుమార్‌తో శివకు మూడేళ్లుగా పరిచయం ఉంది. ఇటీవల శివను కలిసిన సంతోష్‌ తాను ఇచ్చే హష్‌ ఆయిల్‌ను హైదరాబాద్‌కు చేరిస్తే రూ.40 వేలు ఇస్తానంటూ చెప్పడంతో అంగీకరించిన శివ తనకు సహకరిస్తే ఆ మొత్తంలో సగం ఇచ్చేలా నూక రాజుతో ఒప్పందం కుదుర్చుకుని వీరిద్దరూ బుధవారం విశాఖలోని లంకెలపాలెం వెళ్లి సంతోష్‌ను కలిశారు.

అక్కడ సంతోష్‌తో పాటు అతడి స్నేహితుడైన సంజీవ్‌రావు కూడా ఉన్నాడు. లీటర్‌ హష్‌ ఆయిల్‌ను గిఫ్ట్‌కవర్‌లో ప్యాక్‌ చేసి సంతోష్‌ వీరికి అప్పగించాడు. గ్రీజు డబ్బా అడుగున మూడు లీటర్ల హష్‌ ఆయిల్‌ను ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాక్‌ చేసి ఉంచి, దానిపై గ్రీజు నింపిన డబ్బాను సంజీవరావు అప్పగించాడు. వీటిని తీసుకుని శివ, నూక రాజు పోలీసులకు అనుమానం రాకుండా వేర్వేరుగా బయలుదేరారు.

గతంలో గంజాయి, హష్‌ ఆయిల్‌ పంపే ఏజెన్సీ ముఠాలు హైదరాబాద్‌లో ఎవరికి అందించాలే సరఫరా దారులకు చెప్పేవాళ్లు. ఇలా చేస్తే పోలీసులకు వాళ్లూ చిక్కుతున్నారనే ఉద్దేశంతో ఇటీవల పంథా మార్చారు. తొలుత హైదరాబాద్‌ చేరుకున్నాక తమకు ఫోన్‌ చేయాలని, అప్పుడు ఎవరికి అందించాలనేది చెప్తామంటూ శివ, నూకరాజుకు చెప్పారు. వీరి కదలికలపై ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందటంతో ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ నేతృత్వంలోని బృందం హయత్‌నగర్‌ పోలీసులతో కలిసి దాడి చేసి ఇద్దరినీ పట్టుకుని హష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకుని సరఫరా దారుల కోసం గాలిస్తున్నారు. హష్‌ ఆయిల్‌ను నగరంలో లీటర్‌ రూ.4 లక్షలు లేదా 10 ఎంఎల్‌ రూ.4 వేలు చొప్పున అమ్ముతున్నట్లు గుర్తించారు.

చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ..

Advertisement
Advertisement