East Godavari: నకిలీ ఐఆర్‌ఎస్‌ అధికారి అరెస్టు

Police Arrested Fake Ips Officer In East Godavari - Sakshi

ముమ్మిడివరం: ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) ఉన్నతాధికారినంటూ పలు మోసాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ముమ్మిడివరం పోలీస్‌ స్టేషన్‌లో అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి నిందితుడిని గురువారం విలేకర్ల ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. యానాం అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన కాశి ప్రేమ్‌కుమార్‌ గత ఏడాది ఉగాది సమయంలో ఇక్కడ జరిగిన ఒక కవి సమ్మేళనానికి వచ్చాడు. ముమ్మిడివరం పోస్ట్‌మాస్టర్‌ మద్దెల వెంకటేశ్వరరావుకు ఐఆర్‌ఎస్‌ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. సౌతిండియన్‌ కమిషనర్‌నని, సర్వే కమిషనర్‌నని నమ్మించాడు. పోస్టల్‌ రీజియన్‌ అధికారిగా ప్రమోషన్‌ ఇప్పిస్తానని నమ్మబలికాడు.

అతడిని నమ్మిన వెంకటేశ్వరరావు డిసెంబర్‌లో ఒకసారి రూ.లక్ష, మరోసారి రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షలు ఇచ్చాడు. రోజులు గడుస్తున్నా ప్రమోషన్‌ రాకపోవడంతో వెంకటేశ్వరరావుకు అనుమానం వచ్చింది. తీసుకున్న రూ.4 లక్షలు తిరిగి ఇవ్వాలని ప్రేమ్‌కుమార్‌కు చెప్పాడు. ఫలితం లేకపోవడంతో జరిగిన మోసంపై ఈ నెల 2న ముమ్మిడివరం పోలీసులకు వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై కె.సురేష్‌బాబు లోతుగా విచారణ జరిపారు. నిందితుడు ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసి, అతడి నుంచి రూ.40 వేల విలువైన బంగారు గొలుసు, ఉంగరం, నకిలీ డాక్యుమెంట్లు, రబ్బరు స్టాంపులు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ్‌కుమార్‌ డిప్లమో మధ్యలో ఆపేసి, లైబ్రరీలో పుస్తకాలు చదివి ప్రభుత్వ ఉన్నతాధికారుల విధి నిర్వహణ విధానాలు తెలుసుకున్నాడు.

 ఈ నేపథ్యంలో ఐఆర్‌ఎస్‌ అధికారిగా నకిలీ డాక్యుమెంట్లు, రబ్బర్‌ స్టాంపులు, గుర్తింపు కార్డు తయారు చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. కవితలు రాసే అలవాటు ఉండటంతో పద్మశ్రీ అవార్డు అందుకున్నట్టు పలు సాహితీ సంస్థల నుంచి నకిలీ ప్రశంసా పత్రాలు సృష్టించుకున్నాడు. కారులో తిరుగుతూ ఉన్నతాధికారిగా చలామణీ అవుతూ దేవాలయాల వద్ద ప్రొటోకాల్‌ అంటూ నమ్మబలికి మోసాలకు పాల్పడ్డాడు. నిందితుడిని ముమ్మిడివరం కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్సై కె.సురేష్‌బాబును, సిబ్బందిని ఆయన అభినందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top