నేనేమి పాపం చేశానమ్మా..

Parents Leaves New Born Girl At Hospital In Nandyal district - Sakshi

సాక్షి, కర్నూలు రాజ్‌విహార్‌:  కన్నపేగు తెంచుకొని పుట్టిన బిడ్డను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లారు తల్లిదండ్రులు. ఆడపిల్లా అని అలా చేశారో మరెమో తెలియదు కానీ తల్లి ఒడిలో ఉండాల్సిన పాప అనాథగా మిగిలింది.  డోన్‌ పట్టణంలోని రైల్వే స్టేషన్‌ రోడ్డులో ఉన్న యశోద ఆసుపత్రికి గత నెల 30 తేదీ తెల్లవారు జామున ఒక నిండు గర్బిణి పురిటి నొప్పులతో వచ్చింది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వివరాలు ఏమీ అడగకుండా తొలుత కాన్పు చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత వివరాలు అడగగా తన భర్త, తల్లిదండ్రులు కింద ఉన్నారని వారిని కలవమంది. వారిని సంప్రదించగా కొద్ది సేపటి తర్వాత  ఇస్తామని చెప్పి  శిశువును అక్కడే వదిలేసి బాలింతతో కలిసి ఉడాయించారని  డాక్టర్‌ సుంకన్న తెలిపారు.


 మాట్లాడుతున్న ఐసీడీఎస్‌ అధికారులు   

ఈ విషయం పోలీసులకు తెలియజేసి..  పాప కోసం ఎవ్వరైనా వస్తారేమోనని  వేచి చూశామన్నారు. శుక్రవారం వరకు ఎవ్వరూ రాకపోవడంతో ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆశిశువును కర్నూలు శిశుమందిర్‌కు తరలించారు. చిన్నారిని  30 రోజుల్లోపు సంబంధికులు తగిన ఆధారాలు చూపించి తీసుకెళ్లకపోతే చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ తీర్మానం ద్వారా అనాథగా గుర్తించి చట్ట ప్రకారం దత్తత ఇవ్వనున్నట్లు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికార అధికారి కేఎల్‌ఆర్‌కే కుమారి తెలిపారు. వివరాలకు కర్నూలు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయం లేదా సి.క్యాంప్‌ వద్ద ఉన్న శిశుగృహంలో సందర్శించాలని సూచించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top