ఫలించిన పోలీసుల ప్రయత్నం

Opponent Group Tries To Assasination In Pattikonda - Sakshi

కడమకుంట్ల అమరనాథ్‌రెడ్డి హత్యకు సుఫారీ

ఫ్యాక్షన్‌ జోన్‌ పోలీసుల నిఘాతో వెలుగులోకి

నలుగురు వ్యక్తుల అరెస్ట్‌  

పత్తికొండ టౌన్‌ / తుగ్గలి: జిల్లా ఫ్యాక్షన్‌ జోన్‌ పోలీసులు ఓ వ్యక్తి హత్య కుట్రను భగ్నం చేశారు. తుగ్గలి మండల కడమకుంట్ల గ్రామానికి చెందిన ఊటకంటి అమరనాథరెడ్డిని హత్య చేసేందుకు అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు సుఫారీ ఇచ్చారు. పక్కా సమాచారంతో రెండురోజుల కిందట ఫ్యాక్షన్‌ జోన్‌ పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. కేసు వివరాలను సోమవారం పత్తికొండ పోలీసు స్టేషన్‌లో సీఐ రామకృష్ణారెడ్డి మీడియాకు వివరించారు.

1998లో కడమకుంట్ల గ్రామానికి చెందిన సీపీఐ నాయకులు ఊటకంటి లక్ష్మీకాంతరెడ్డి, విశ్వనాథశర్మ హత్యకు గురయ్యారు. ఈ కేసులో హనిమిరెడ్డితో పాటు మరో 14 మందిపై కేసు నమోదైంది. ఈ హత్యలకు ప్రతీకారంగా 2011లో పగిడిరాయి కొత్తూరు సమీపంలో రైల్వే బ్రిడ్జి వద్ద హనిమిరెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఇరువర్గాలు రాజీ అయినా పాతకక్షలు అలాగే ఉండిపోయాయి. ఈ క్రమంలో ఆరు నెలల కిందట లక్ష్మీకాంతరెడ్డి కుమారుడు రాంభూపాల్‌రెడ్డిపై హనిమిరెడ్డి కుమారుడు అమరనాథరెడ్డి పత్తికొండ సమీపంలో జీపుతో ఢీకొట్టి హత్యాయత్నానికి ప్రయత్నించాడని పత్తికొండ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనల నేపథ్యంలో అమరనాథ్‌రెడ్డిని అంతమొందించేందుకు ప్రత్యర్థులు కుట్రపన్ని చివరకు పోలీసులకు చిక్కారు.

రూ. 4 లక్షలకు సుఫారీ..
అమరనాథ్‌రెడ్డిని హత్య చేసేందుకు హనిమిరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడమకుంట్ల బొగ్గుల సుధాకర్‌తో పాటు సురేష్, సోమశేఖరరాజు కుట్ర పన్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ములకలపెంటకు చెందిన ఎద్దుల వీరాంజినేయులుతో రూ. 4 లక్షలకు సుఫారీ మాట్లాడారు. ఈ మేరకు రూ. 3 లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చారు. కాగా నెలలు గడుస్తున్నా పని పూర్తిచేయక పోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని వీరాంజినేయులుపై సుధాకర్‌ ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయం నిఘా వర్గాలకు తెలియడంతో ఫ్యాక్షన్‌ జోన్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. గత నెల 31వ తేదీన వీరాంజినేయులతో పాటు సుధాకర్, సురేశ్‌, సోమశేఖరరాజును అదుపులోకి విచారణ చేశారు. సోమవారం నిందితులను పత్తికొండ కోర్టులో హాజరు పరుచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు. సమావేశంలో ఫ్యాక్షన్‌ జోన్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సోమ్లానాయక్, జొన్నగిరి ఎస్‌ఐ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఉన్న కడమకుంట్ల గ్రామంలో ఈ ఘటన అలజడి రేపింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top