ఇరు కుటుంబాల మధ్య పాతకక్షలు...హంతకుడిగా మారిన పెళ్లి కొడుకు

Old Fashioned Tuned Groom Into Assassination On Wedding Day - Sakshi

సాక్షి, ఆదిలాబాద్ (నిర్మల్‌ రూరల్‌): ఇరువురి మధ్య పాతకక్షలు పెళ్లిరోజున పెళ్లికొడుకును హంతకుడిగా మార్చాయి. ఆనందంగా సాగాల్సిన వివాహ బారాత్‌ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అప్పటి వరకు రెండు పెళ్లిళ్లతో సందడిగా ఉన్న ఆ గ్రామం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇదంతా.. ఈనెల 23న రాత్రి దిలావర్‌పూర్‌ మండలం కాల్వతండాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు శనివారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో డీఎస్పీ ఉపేంద్రరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. 

ఆ రోజు ఏం జరిగిందంటే..
ఈనెల 23న కాల్వతాండకు చెందిన బానావత్‌ సాయికుమార్‌ వివాహం లోకేశ్వరం మండలం పుస్పూర్‌లో జరిగింది. అదే తండాకు చెందిన మెగావత్‌ రాజు పెళ్లి లోకేశ్వరం మండలంలోని నగర్‌తండాలో నిర్వహించారు. వివాహాల అనంతరం అదేరోజు రాత్రి కాల్వతండాలో రెండు పెళ్లిళ్లకు సంబంధించిన బారాత్‌లను వేర్వేరుగా నిర్వహించారు. బానావత్‌ సాయికుమార్, మెగావత్‌ రాజు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా భూతగాదాలు ఉన్నాయి. ఈక్రమంలో రాజు వాళ్ల కంటే తన బారాత్‌ బాగా జరగాలని సాయికుమార్‌ తన పదోతరగతి మిత్రులను పిలిపించుకున్నాడు. వారికి మద్యం తాగించాడు. రాత్రి 11గంటల సమయంలో బారాత్‌ అనంతరం సాయికుమార్‌ ఇంటికి చేరుకున్నాడు. రాజు బారాత్‌ తనకంటే బాగా జరగడంతో ఆగ్రహానికి లోనయ్యాడు. అప్పటికే వెళ్లిపోయిన తన డీజే వాహానాన్ని వెనక్కి రప్పించాడు. కావాలని రాజు వాళ్ల దగ్గరికి తీసుకువెళ్లి, సౌండ్‌ ఎక్కువ పెట్టి తన స్నేహితులతో డ్యాన్స్‌ చేశాడు.

మధ్యలో వచ్చి ప్రాణాలు కోల్పోయి.. 
సాయికుమార్‌ విపరీతంగా డీజేసౌండ్‌ పెట్టడంతో కొంచెం తగ్గించుకోవాలని రాజు బంధువైన మెగావత్‌ నవీన్‌(26) వాళ్ల దగ్గరికి వచ్చి కోరాడు. అప్పటికే రాజుపై ఆగ్రహంతో ఉన్న సాయికుమార్‌ పాతకక్షలనూ దృష్టిలో ఉంచుకుని మధ్యలో వచ్చిన నవీన్‌తో గొడవపడ్డాడు. తన స్నేహితులతో కలిసి ఆయనను కిందపడేసి, కాళ్లతో తొక్కారు. దీంతో స్పహతప్పిన నవీన్‌ను కుటుంబసభ్యులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే నవీన్‌ చనిపోయాడని ధ్రువీకరించారు. మృతి చెందిన నవీన్‌కు భార్య, మూడేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు కుటుంబాల మధ్యలో ఉన్న పాతకక్షలు అమాయకుడైన నవీన్‌ను బలిగొన్నాయి. 

సీసీ కెమెరాల ఆధారంగా..
జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీఎస్పీ వివరించారు. గ్రామంలోని సీసీకెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈమేరకు నవీన్‌ మరణానికి కారకులైన బానావత్‌ సాయికుమార్, అతడి స్నేహితులైన పడిగెల భూమేష్, చినీట్ల దిలీప్, తుమ్మ సాయికుమార్, గాంధారి రాకేష్, చాçకపురం లక్ష్మణ్, నూక మహేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. 

సుప్రీంకోర్టు నిబంధనలు పాటించాలి..
డీజే నిర్వాహకులు సుప్రీంకోర్టు నిబంధనలు తప్పకుండా పాటించాలని డీఎస్పీ తెలిపారు. ఉదయం 6నుంచి రాత్రి 10గంటల వరకు మాత్రమే డీజేలకు అనుమతి ఇస్తామన్నారు. డీజే ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పకుండా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. యువత క్షణికావేశంతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. కాల్వతండా ఘటనలో డీజేలను బైండోవర్‌ చేసి, కేసు నమోదు చేశామన్నారు. సమావేశంలో రూరల్‌ సీఐ వెంకటేశ్, దిలావర్‌పూర్, సారంగాపూర్‌ ఎస్సైలు పాల్గొన్నారు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top