తల్లీ కూతురు హత్య.. వ్యక్తికి జీవితాంత ఖైదు

Murder of mother and daughter - Sakshi

చిత్తూరు అర్బన్‌: తల్లీ, కూతురిని హతమార్చి.. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ వ్యక్తికి మరణించేంత వరకు జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని ప్రత్యేక మహిళా కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శైలజ కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలంలోని గంగిరెడ్డి కాలనీకి చెందిన సయ్యద్‌ మౌలాలి(47) అనే వ్యక్తి వృత్తిరీత్యా చెరువులను లీజుకు తీసుకుని చేపలు పట్టి విక్రయించే వ్యాపారం చేసేవాడు. మండలంలోని గిరిజన తాండాకు చెందిన సరళమ్మ(37)కు భర్త మరణించాడు.

ఆమెతో మౌలాలి కొన్నాళ్లపాటు సహజీవనం చేశాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, తల్లి ఉన్నారు. సరళమ్మ వేరే మగాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతోందనే అనుమానంతో ఆమెతో రాత్రి పొలం వద్ద గొడవపడ్డాడు. మాటామాటా పెరిగి ఆమెను కర్రతో తలపై కొట్టాడు. ఆమె చనిపోవడంతో పెద్దేరు ప్రాజెక్టులో వేసేశాడు. శవం పైకి తేలకుండా చీరకు రాళ్లు కట్టిపడేశాడు. మరుసటి రోజు ఆమె తల్లి గంగులమ్మ తన కుమార్తె ఎక్కడని మౌలాలిని నిలదీసింది. నీ కుమార్తె ఉదయానికల్లా వస్తుందని నమ్మబలికాడు.

ఆమెకు మద్యం అలవాటు ఉండడంతో మద్యం తెచ్చి ఇచ్చాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో  చీరకొంగుతో గొంతుకు బిగించి చంపేశాడు. శవాన్ని ఓ చెరువులోకి తీసుకెళ్లాడు. శవం పైకి లేవకుండా ఆమె చీరను నీటిలోని ఓ చెట్టు మొదలుకు కట్టివేశాడు. ఆ మరుసటిరోజు సరళమ్మ కుమార్తెలు తమ అమ్మ, అవ్వ ఎక్కడని మౌలాలీని నిలదీశారు. వారికి కరోనా రావడంతో మదనపల్లె ఆస్పత్రిలో చేర్పించానని వారిని నమ్మించాడు. వారితో కలసి అక్కడే పడుకునే వాడు. వారిలో పెద్ద అమ్మాయిపై లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెబితో చంపేస్తానని బెదిరించాడు. ఇలా నెల రోజులు గడిచాక ఆ పిల్లలు ముగ్గురిని కర్ణాటక గౌనిపల్లెలోని ఓ ఇంట్లో ఉంచాడు. 

బంధువుల ఫిర్యాదు
సరళమ్మ, ఆమె తల్లి గంగులమ్మ, కుమార్తె కనపడకపోవడంతో వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సయ్యద్‌ మౌలాలిని అరెస్టు చేసి.. బాలికలను అతడి నుంచి విడిపించారు. నిందితుడు చెప్పిన వివరాలతో చెరువులో పడున్న తల్లీ, కుమార్తె మృతదేహాలను బయటకు తీశారు.  అతనిపై పలు హత్యలు, అత్యాచారం, అట్రాసిటీ, అపహరణ కేసులు నమోదు చేశారు.

నిందితుడిపై మోపిన అభియోగాలు న్యాయస్థానంలో రుజువుకావడంతో.. అతను మరణించేంత వరకు జైల్లో ఉండాలని, రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శాంతి సోమవారం తీర్పునిచ్చారు. బాలికకు రూ.5 లక్షల పరిహారం మంజూరు చేయాలని  కలెక్టర్‌కు సూచిస్తూ తీర్పులో పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top