మృతదేహం మాయం: టీఆర్‌ఎస్‌ నాయకుడి ఇంటి ముట్టడి | Minor Boy assassinated In Nizamabad | Sakshi
Sakshi News home page

మృతదేహం మాయం: టీఆర్‌ఎస్‌ నాయకుడి ఇంటి ముట్టడి

May 21 2021 9:59 AM | Updated on May 21 2021 11:20 AM

Minor Boy assassinated In Nizamabad - Sakshi

టీఆర్‌ఎస్‌ నేత ఇంటిని ముట్టడించిన స్థానికులు, ఇన్‌సెట్‌లో సిద్ధార్థ(ఫైల్‌)

సాక్షి, కమ్మర్‌పల్లి: మండలంలోని హాసాకొత్తూర్‌లో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ బాలుడు దారుణ హత్యకు గురవడం, అనుమానితుడి ఇంటిని వందలాది మంది ముట్టడించడం, పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హాసాకొత్తూర్‌ మారుతినగర్‌లో నివాసముండే మాలవత్‌ శ్రీనివాస్, సరోజ దంపతులకు ఇద్దరు కుమారులు కృష్ణ, సిద్ధార్థ (17) ఉన్నారు. ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్‌ అచేతన స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. సరోజ వ్యవసాయ కూలీ కాగా, పెద్ద కొడుకు చదువుకుంటున్నాడు. చిన్న కొడుకు సిద్ధార్థ హార్వెస్టర్‌ క్లీనర్‌గా కుటుంబానికి అండగా ఉంటున్నాడు. 

కరోనాతో చనిపోయాడని.. 
బుధవారం రాత్రి సిద్ధార్థను అతని స్నేహితుడు నరేందర్‌ వచ్చి మెదక్‌ వెళ్లాల్సి ఉందని చెప్పి తీసుకెళ్లాడు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో సిద్ధార్థకు వరసకు మామ అయిన వసంత్, అన్న కృష్ణకు ఫోన్‌ చేసి సిద్ధార్థ కరోనాతో చనిపోయాడని టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు కనక రాజేశ్‌ చెప్పాడు. అంత్యక్రియల నిమిత్తం గండి హన్మాన్‌ ప్రాంతానికి రమ్మని తెలిపాడు. దీంతో కృష్ణ, వసంత్‌తో పాటు రవి, స్వామి అక్కడకు వెళ్లగా, ఎవరు లేరు. మరోవైపు, సిద్ధార్థ గురించి నరేందర్‌ను అడిగితే రాత్రి భోజనం చేశామని, కొద్దిసేపటికి సిద్ధార్థకు ఫోన్‌ రాగా బయటకు వెళ్లాడని తెలిపాడు.  మరోవైపు, గండి హన్మాన్‌ వద్ద మృతదేహం ఉందని చెప్పినప్పటికీ అక్కడ లేకపోవడం, ఆర్మూర్‌ ప్రభుత్వాస్పత్రి మార్చురీ గదిలో మృతదేహం తేలడం అంతా సినీ ఫక్కీలో జరిగి పోయింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియగా, వారు మార్చురీకి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా, శరీరంపై, తలపై కమిలి పోయిన గాయాలు కనిపించాయి. కట్టెలతో కొట్టి చంపేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు.

ఇంటిపై దాడికి యత్నం.. 
గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. కనక రాజేశ్, అతని అనుచరులు కలిసి 15 రోజుల క్రితమే కృష్ణ, సిద్ధార్థను చంపేస్తామని బెదిరించారని కుటుంబ సభ్యులు బోరుమన్నారు. ఈ క్రమంలోనే సిద్ధార్థను కనక రాజేశ్, అతని అనుచరులు బాలాగౌడ్, పృథ్వీరాజ్, అన్వేష్‌ తదితరులు కలిసి చంపేశారని వాపోయారు. తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు రాజేశ్‌ ఇంటిని ముట్టడించారు. నిందితుడి ఇంటిపై దాడికి యత్నించగా, పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. గంట గంటకు పరిస్థితులు మారి పోవడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో బలగాలను దింపారు. ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలుమార్లు ఆందోళనకారులను చెరదగొట్టారు. పరిస్థితులు చేయి దాటుతుండడంతో అదనపు బలగాలను పిలిపించారు. ఇటు స్థానికులు, అటు పోలీసులు.. ఆరేడు వందల మందికి పైగా అక్కడ గుమిగూడారు. సాయంత్రం వేళ నిజామాబాద్‌ డీసీపీలు స్వామి, శ్రీనివాస్, ఆర్మూర్‌ ఏసీపీ రఘు చేరుకొని కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. న్యాయం జరిగేలా చూస్తామని, నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. 

బందోబస్తు నడుమ అంత్యక్రియలు.. 
పరిస్థితులు అదుపులోకి వచ్చాక పోలీసులు రాత్రి ఏడు గంటల సమయంలో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉన్నతాధికారుల సమక్షంలో, భారీ బందోబస్తు మధ్యే రాత్రి వేళ ఖననం చేశారు. మరోవైపు, మృతుడి సోదరుడు కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రాజేశ్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. 

చదవండి: రైస్‌పుల్లింగ్‌: రాగిపాత్రకు రంగుపూసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement