తోటి ఉద్యోగే ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. దీంతో ఆ మహిళ..

సాక్షి, పెద్దపల్లిరూరల్: తోటి ఉద్యోగే ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధించడంతో భరించలేక పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామ వీఆర్‌ఏ దివ్య (33) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం నిమ్మనపల్లి గ్రామానికి చెందిన దివ్యకు సబ్బితం గ్రామానికి చెందిన శేఖర్‌తో వివాహమైంది. మనస్పర్ధల కారణంగా వారిద్దరూ విడిపోయి, విడాకులు పొందారు.
నిమ్మనపల్లి వీఆర్‌ఎగా విధులు నిర్వహిస్తూ దివ్య ప్రస్తుతం పెద్దపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో డెప్యూటేషన్‌పై పనిచేస్తోంది. ఈ క్రమంలో కొత్తపల్లి గ్రామ వీఆర్‌ఏ పెర్క వెంకటేశ్ తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధిస్తుండడంతో మనస్తాపానికి గురై ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతురాలి సోదరుడు దిలీప్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి తల్లిదండ్రులు పోచమ్మ, నర్సయ్య సోదరులు దిలీప్, దినేశ్ ఉన్నారు.