పొలం కోసం కొట్టి.. చంపేశారు! | Man beaten to death over land dispute in Narayanapet district | Sakshi
Sakshi News home page

పొలం కోసం కొట్టి.. చంపేశారు!

Published Sat, Jun 15 2024 6:14 AM | Last Updated on Sat, Jun 15 2024 6:14 AM

Man beaten to death over land dispute in Narayanapet district

దయలేని దాయాదులు 

రెండెకరాల భూమి కోసం అన్నదమ్ముల పిల్లల ఘాతుకం 

వరుసకు సోదరుడిపైనే విచక్షణారహితంగా దాడి.. 

చికిత్సకు తరలిస్తుండగా మృతి 

100కు సమాచారం ఇచ్చినా స్పందించని పోలీసులు 

నారాయణపేట జిల్లా చిన్నపొర్లలో అమానుష ఘటన

రెండెకరాల పొలం కోసం రక్తసంబంధీకుడిపైనే కర్ర లతో విరుచుకుపడ్డారు. కన్నవాళ్లు కాళ్లా.. వేళ్లా పడ్డా కనికరించలేదు.. కన్నూ.. మిన్నూ కానక.. ఎక్కడపడితే అక్కడ పది మందికిపైగా మూకుమ్మడిగా విచక్షణారహితంగా దాడి చేయడంతో చెవులు, నోట్లో నుంచి రక్తం కారి.. నిస్సహాయ స్థితిలో స్పృహ కోల్పోవడంతో వదిలేశారు. చివరికి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయువు కోల్పోయాడు.

మక్తల్‌/ ఊట్కూర్‌/నారాయణపేట: నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో అమానుష ఘటన చోటుచేసుకుంది. రెండెకరాల భూమి కోసం.. ఒక్కడిని చేసి దాయాదులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. చిన్నపొర్ల గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు ఇద్దరు భార్యలు బాలమ్మ, తిప్పమ్మ. వీరు గతంలోనే మృతి చెందారు. మొదటి భార్య బాలమ్మకు ఒక కొడుకు గువ్వల ఎర్రగండ్ల సంజప్ప కాగా.. రెండో భార్య తిప్పమ్మకు ఇద్దరు కుమారులు పెద్ద సవారప్ప, చిన్న సవారప్ప.

లక్ష్మణ్‌కు 9 ఎకరాల భూమి ఉండగా.. మూడు భాగాలుగా విభజించి ముగ్గురు కుమారులపై మూడు ఎకరాల చొప్పున పట్టా చేయించారు. దీనిపై కొంత కాలంగా మొదటి భార్య కుమారుడు ఎర్రగండ్ల సంజప్ప.. తొమ్మిది ఎకరాలను ఇద్దరి భార్యల పిల్లలకు రెండు భాగాలుగా విభజించి.. నాలుగున్నర ఎకరాల చొప్పున భాగ పరిష్కారం చేయాలని వాదిస్తూ వస్తున్నాడు. ఆ లెక్కన తనకు నాలుగున్నర ఎకరాలు, రెండో భార్య ఇద్దరు కుమారులకు కలిపి నాలుగున్నర ఎకరాలు దక్కాలని వాదిస్తూ వచ్చిన ఎర్రగండ్ల సంజప్ప ఆమధ్యన మృతిచెందాడు. అప్పటి నుంచి సమస్య పరిష్కారం కాకుండా పోయింది. 

విత్తనాలు చల్లేందుకు రాగా..  
ఈ క్రమంలోనే భూ సమస్య ఉందని 20 రోజుల క్రితం ఇరు వర్గాల వారు ఊట్కూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. రెండు రోజు ల క్రితం విత్తనాలు వేసుకుంటామని పెద్ద సవార ప్ప, చిన్న సవారప్ప మక్తల్‌ సీఐ, ఊట్కూర్‌ ఎస్‌ఐలను అడగగా.. ఎవరి పేరు మీద పట్టా ఉంటే వారు వేసుకోండని సూచించారు. దీంతో గురువారం సాయంత్రం పొలంలో విత్తనాలు వేసేందుకు పెద్ద సవారప్ప, ఆయన కుమారుడు సంజీవ్‌(28), చిన్న సవారప్ప కలిసి ట్రాక్టర్‌ తీసుకువెళ్లారు.

ఈ విషయం తెలు సుకున్న ఎర్రగండ్ల సంజప్ప కుమారులు గుట్టప్ప, ఆటో సంజప్ప, కుటుంబసభ్యులు గువ్వల శేఖర్, పెద్ద సంజప్ప, చిన్న సంజప్ప, ఆశప్ప, మారుతి, పెద్ద సవారప్ప, కిష్టప్ప, శ్రీను, రేణుక, సుజాత, బుజ్జమ్మ, అర్చన, అంజమ్మ, మౌనిక, వెంకటమ్మ, లక్ష్మి పొలం దగ్గరికి వచ్చారు. విత్తనాలు ఎందుకు వేస్తున్నావని సంజీవ్‌ను ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే సంజీవ్‌పై అవతలి వర్గం వారు కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడే ఉన్న గువ్వల ఎర్రగండ్ల సంజప్ప చిన్నమ్మ కవిత మనుమడిని కొట్టొద్దని కాళ్లపై పడినా పట్టించుకోలేదు. వెంటనే తమకు పరిచయం ఉన్న పెద్దజట్రం గ్రామ ఎంపీటీసీ సభ్యుడు కిరణ్‌కు సమాచారం అందించగా.. ఆయన ఊట్కూర్‌ ఎస్‌ఐకి ఫోన్‌ చేసి చెప్పగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచి్చనట్లు తెలుస్తోంది.  

‘100’కి డయల్‌ చేసినా స్పందించలే.. 
చిన్నపొర్లలో పొలం దగ్గర ఘర్షణ జరుగుతుందని సమీపంలోని వారు డయల్‌ 100కు సమాచారం ఇచి్చనా, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా స్పందించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా సంజీవ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా ఆలస్యంగా వచ్చింది. అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సంజీవ్‌కు భార్య అనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

గ్రామంలో ఉద్రిక్తత 
హత్య ఘటన దరిమిలా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మక్తల్, ఊట్కూర్, మాగనూర్, కృష్ణ పోలీసులు అక్కడికి చేరుకొని పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై బంధువు కవిత పోలీసులకు ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఊట్కూర్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. కాగా, పోస్టుమార్టం అనంతరం సంజీవ్‌ మృతదేహం గ్రామానికి తీసుకురాగా, ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే సంజీవ్‌ మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపిస్తూ ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలని నినాదాలు చేశారు. 

ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు  
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ ఎస్‌ఐ బిజ్జ శ్రీనివాసులును సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ మల్టీ జోన్‌–2 ఐజీ జి.సుధీర్‌బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై ఫిర్యాదు అందినా తక్షణ మే స్పందించకుండా తీవ్ర నిర్లక్ష్యం, దురుసుగా ప్రవర్తించినట్లు ఐజీపీ దృష్టికి వచి్చనట్టు ఉత్తుర్వుల్లో పేర్కొన్నట్టు ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ తెలిపారు. 

నలుగురి అరెస్టు.. ముగ్గురు పరారీలో ఊట్కూరు ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులపై కేసు నమోదు కాగా శుక్రవారం నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఏ4 చిన్న సంజప్ప, ఏ5 గుడి ఆశప్ప, ఏ6 గువ్వల శ్రీను, ఏ7 గువ్వల కిష్టప్పను అరెస్టు చేసినట్లు ఐజీపీ సు«దీర్‌బాబు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement